నవ్వేద్దాం కాసేపు..!
నవ్వేద్దాం కాసేపు
వాన చినుకుల్లో తడిసీ తడవనట్టు
ఆకలి వేళల్లో కడుపు నిండీ నిండనట్టు
సాయంకాలాల్లో ఓ కల దొరికీ దొరకనట్టు
జీవితం దోబూచులాడుతున్నా…
నవ్వేద్దాం కాసేపు…
తూరుపు నిండా మేఘాలున్నా
తుఫానులొచ్చే సూచనలున్నా
తురాయి పువ్వులు రాలుతూ
ఓ బాధ్యతేదో తలపున తురుముతున్నా…
నవ్వేద్దాం కాసేపు
చిరునవ్వులకెవరూ తోడు లేకున్నా
రేపటికి ఏదీ మిగిలి లేకున్నా
గాయపడిన పాదాలతోనూ ఎక్కడా ఆగలేకున్నా
నడుస్తూ నడుస్తూనే అలా…
నవ్వేద్దాం కాసేపు…
ఒంటరిగానే సముద్రాన్ని కలవాల్సి ఉన్నా
ఉప్పగా దుఃఖ సమయాలు దాటాల్సి ఉన్నా
ఊపిరి యుద్ధాలు ఎన్నో చేయాల్సి ఉన్నా
అన్నింటికీ సమాయత్తమవుతూనే….
నవ్వేద్దాం కాసేపు…
పచ్చని పంటల కోసం కొన్ని పాటలు పాడి
బుజ్జి పిచ్చుకల కోసం కొంత ధాన్యం చల్లి
నీటి చెలిమెల చెంతకు దోసిలిని మోసి
కొత్త సత్తువను లోలోపలికి తీసుకొంటూ…
నవ్వేద్దాం కాసేపు…
ఎప్పటికైనా సరే వెంట రాగల గాలులుంటాయ్
ఏదో ఒకరోజు వెంబడించే పరిమళాలుంటాయ్
ప్రేమగా దోవ చూపే పావురాలుంటాయ్
ఎర్రెర్రటి సూర్యబింబం దిశగా వడిగా అడుగులేసుకొంటూ…
నవ్వేద్దాం కాసేపు…
ఎవ్వరో వెనక్కి లాగేస్తున్నప్పుడు
ఎవ్వరో పాదాల కింది మట్టిని కబ్జా చేస్తున్నప్పుడు
ఎవ్వరో దారంతా ఆక్రమించి భయపెడుతున్నప్పుడు కూడా
దూసిన కత్తిని ముద్దాడి ఎప్పటిలాగే సాగిపోతూ…
నవ్వేద్దాం కాసేపు…
వసంతాల కోసం హృదయం అడుగుతున్నపుడు
వెన్నెలల కోసం రేయి వేచియున్నపుడు
ఈ ప్రపంచం స్నేహం కోసం పరితపిస్తున్నప్పుడు
గింజలమై రాలిపడినా సరే మొలకెత్తే దృశ్యమై భూమికి కానుకవుతూ…
నవ్వేద్దాం కాసేపు…
నవ్వడం తెలియాలి ముందు
వేకువ కాగడా పట్టి
పున్నమి దీపం పెట్టి
వెళ్ళిపోతూ ఆశను సంతకం చేసే కాలమవుతూ కథలమవుతూ… నవ్వేద్దాం కాసేపు!
– జి. కళావతి