కాంగ్రెస్ పార్టీలో జోష్..
- విజయభేరి విజయవంతం..
- ఆరు గ్యారంటీలపై క్షేత్రస్థాయిలో చర్చ
- బీఎస్సీ – వామపక్షాలతో కలిస్తేనే…
నిర్దేశం, హైదరాబాద్ : హైదరాబాద్ లోని తుక్కుగూడలో నిర్వహించిన విజయభేరి సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ పార్టీలో నూతనోత్సాహం కనిపిస్తోంది. సభకు రాష్ట్రం నాలుమూలాల నుంచి పెద్ద సంఖ్యలో జనాలు తరలి వచ్చారు. ఈ సందర్భంగా తమ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేసే ఆరు పథకాలను ప్రకటించారు. ఈ పథకాలపై క్షేత్రస్థాయిలో విసృత చర్చ జరుగుతోంది. మహాలక్ష్మీ పథకం కింద మహిళాలకు ప్రతి నెల రూ. 2500 ఇస్తామని ప్రకటించింది. సిలిండర్ రూ. 500 లకే అందిస్తామని, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ప్రకటించింది. ఈ పథకం మహిళాలను ఆకర్శిస్తోంది.
ఒంటరి మహిళలకు, వితంతువులకు, వృద్దులకు ప్రస్తుతం ఆసరా ఫించన్ రూ.2016 అందుతొంది. కాంగ్రెస్ పార్టీ అందరికి రూ.2500 ప్రకటించింది. సిలిండర్ ధర ప్రస్తుతం తొమ్మిది వందల యాభై ఉండగా, రూ. 500 లకే ఇస్తే పేదలకు ఎంతో ఉపశమనం కల్గుతుంది. కర్నాటకలో అమలు చేస్తున్న ఉచిత బస్సు కూడా మహిళలను ఆకర్శిస్తోంది. రైతు భరోసా కింద ప్రతి ఏట రైతులకు, కౌలు రైతులకు రూ. 15 వేలు, కూలీలకు రూ. 12 వేలు వరి ధాన్యంకు రూ. 500 బోనసు ఇస్తామని ప్రకటించింది. ప్రస్తుతం పట్టదారులకు మాత్రమే ప్రభుత్వం ఎకరం 10 వేలు అంద చేస్తోంది. కొత్తగా కౌలు రైతులకు, రైతు కూలీలకు ప్రయోజనం కలిగెలా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. గృహాజ్యోతి కింద ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇల్లు నిర్మించుకోవడానికి రూ. ఐదు లక్షలు, యువ వికాసం కింద విద్యార్థులకు ఐదు లక్షలు, చేయూత పథకం కింద పెన్షన్ రూ.4000 ఇస్తామని ప్రకటించింది. ఈ పథకాలు అన్నీ వర్గాలను ఆకర్శింప చేస్తున్నాయి. ప్రజల నుంచి వస్తున్న ఆధరణను కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటుందనేదే సందేహంగా మారింది. విజయభేరికి వచ్చిన జనాన్ని చూసి అధికారంలోకి వచ్చినట్లు భావిస్తే భ్రమే అవుతుంది. నియోజక వర్గాలలో పట్టున్న వారికే టిక్కెట్ ఇవ్వడంతో పాటు ఓట్లు చీలిపోకుండా వ్యూహాత్మాకంగా వ్యవహరిస్తేనే విజయం సాధించే అవకాశం ఉంది.
టికెట్లకు పోటీ…
కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించిన తరువాత తెలంగాణాలో అనూహ్యంగా బలం పుంజుకుంది. బీజేపీ అవకాశాన్ని జారవిడుచుకోవడంతో కాంగ్రెస్ కు కలిసి వచ్చింది. అప్పటి నుంచి వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు కాంగ్రెస్ లో చేరారు. దీంతో టికెట్ల కోసం పోటీ పెరిగింది. క్షేత్ర స్థాయిలో ఆశవాహులపై సర్వే నిర్వహించారు. నియోజక వర్గానికి ముగ్గురిని ఎంపిక చేసి అందులో నుంచి ఒకరి అభ్యర్థిత్వం ఖరారు చేయనున్నారు. ప్రస్తుతం స్క్రీనింగ్ కమిటీ పేర్లను పరిశీలిస్తోంది. కాంగ్రెస్ లో గ్రూపులు, స్వేచ్ఛ ఎక్కువ. ఎవరికి వారు తమ అనుచరులకు టికెట్ కోసం పట్టుబడితే అసలుకే మోసం వచ్చే అవకాశం ఉంది.
బీఎస్సీ – వామపక్షాలతో కలిస్తేనే..
పదేళ్ల పాటు అధికారంలో ఉండి అన్ని రకాలుగా బలంగా ఉన్న బీఆర్ ఎస్ పార్టీని ఒంటరిగి పోటీ చేసి ఓడించే గల సత్తా కాంగ్రెస్ పార్టీకి లేదు. రాష్ట్రంలో బీఆర్ ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు పోటీలో ఉండనున్నారు. త్రికోణ పోటీలో బీఆర్ ఎస్ పార్టీకి కొంత మేలు జరిగే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితులలో ఓట్లు చీలి పోకుండా వ్యూహంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. మునుగోడు ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ బీఆర్ ఎస్ అభ్యర్థి విజయం కోసం వామపక్షాల మద్దతు కోరి విజయం సాధించారు. ప్రస్తుతం వామపక్షాలు బీఆర్ ఎస్ కు దూరమయ్యారు. వామపక్షాలను, బీఎస్ పీని తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. ప్రతి నియోజక వర్గంలో ఓటు బ్యాంక్ ఉంది. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ కు ప్రతి నియోజక వర్గంలో ప్రజలతో సంబంధాలు ఉన్నాయి. వామ పక్షాలు, బీఎస్పీ తో అవగహన చేసుకుంటెనే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి పోకుండా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అవకాశాలను ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటుందో వేచి చూడాల్సిందే..