సీఎం కేసీఆర్‌పై విజయశాంతి తీవ్ర వ్యాఖ్యలు..!

సీఎం కేసీఆర్‌పై విజయశాంతి తీవ్ర వ్యాఖ్యలు..!

హైదరాబాద్: బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం అంటే క్రిమినల్ మినిస్టర్ అంటూ వ్యాఖ్యానించారు. ఇల్లీగల్ దందా చేసేది కేసీఆర్ ప్రభుత్వమే అంటూ ధ్వజమెత్తారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం కేసీఆర్ ప్రభుత్వంలో కొన్నేళ్లుగా జరుగుతున్న వ్యాపారం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నేరుగా చైర్మన్ రూమ్కి వెళ్లి పేపర్ లీక్ చేయొచ్చా? అంటూ విజయశాంతి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఈ లీకేజీ వ్యవహారంపై ప్రభుత్వం సిట్ వేసింది. మరోవైపు ఈ పేపర్ లీకేజీ వ్యవహారంలో నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అలాగే నిందితుల్ని పోలీసులు కస్టడీకి తీసుకుని కూడా విచారిస్తున్నారు. ఇంకోవైపు ఈ కేసులో ఆధారాలు ఇవ్వాలంటూ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు సిట్ నోటీసులు అందజేసింది. మరోవైపు విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నాయి.
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు దర్యాప్తులో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. టీఎస్‌పీఎస్సీలో ఉద్యోగాలు చేస్తూ గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష రాసి మొయిన్స్‌కు అర్హత సాధించిన 8 మందిని విచారించిన క్రమంలో షమీమ్‌ అనే ఉద్యోగినితో పాటు రమేశ్‌కు పేపర్‌ లీకేజీతో సంబంధం ఉన్నట్లు గుర్తించారు. ఇదిలా ఉండగా.. 100కు పైగా మార్కులు వచ్చిన 120 మందిలో ఇప్పటి వరకు 40 మందిని సిట్‌ విచారించింది. మిగిలిన 80 మందికీ నోటీసులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. 80 మందిలో కొందరు ఎన్‌ఆర్‌ఐలు కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులను విచారించిన క్రమంలో రాజశేఖర్‌, ప్రవీణ్‌ ద్వారా గ్రూప్‌-1 పేపర్‌ వాట్సాప్‌లో ఎన్‌ఆర్‌ఐలకు అందినట్లుగా పోలీసులు గుర్తించారు.

ఇక ఏఈ ప్రశ్నపత్రం లీకేజీతో సంబంధం ఉన్న రేణుక, ఢాక్యానాయక్‌కు గ్రూప్‌-1 పేపర్‌ లీకేజీతో కూడా సంబంధాలున్నట్లు సిట్‌ అధికారులు అనుమానిస్తున్నారు. అలాగే మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబ్‌పేట మండలంలో ఉపాధి హామీ టెక్నికల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ప్రశాంత్‌రెడ్డి ఏఈ పరీక్ష రాశారు. విచారణ నేపథ్యంలో ఇతని పేరు బయటకు రావడంతో శుక్రవారం సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇతనితో పాటు షాద్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి, నవాబ్‌పేటకు చెందిన మరో ఇద్దరిని కూడా సిట్‌ అధికారులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రూపు-1 ప్రశ్నపత్రం కోసం రూ.7.50 లక్షలు చెల్లించినట్లు ప్రచారం జరుగుతోంది. వీరందరినీ విచారిస్తే.. మరిన్ని విషయాలు బయటకొచ్చే అవకాశం ఉంది..

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »