9 టెర్రర్ క్యాంప్‌లు.. జస్ట్ 24 నిమిషాల్లో ఖతం..

9 టెర్రర్ క్యాంప్‌లు.. జస్ట్ 24 నిమిషాల్లో ఖతం..

న్యూఢిల్లీ, నిర్దేశం:
భారతీయ పౌరుల ఊపిరి తీసి  హాయిగా సేద తీరుతున్న ఉగ్ర మూకలను ఊచకోత కోసింది ఇండియన్ ఆర్మీ. సరిగ్గా తెల్లవారుజాము సమయంలో ఊహించని రీతిలో అటాక్ చేసి ఆ నర రూప రాక్షసుల అంతు చూసింది. 9 ఉగ్ర శిబిరాలపై ఏక కాలంలో 24 క్షిపణులు దాడి చేసి సమస్తం నేలమట్టం చేశాయి. ఇంత విధ్వంసం కేవలం 24 నిమిషాల్లోనే పూర్తవడం విశేషం. పెళ్లై పది రోజులైనా కాకుండా, సింధూరానికి దూరమైన ఆడబిడ్డ కన్నీటి సాక్షిగా ఆపరేషన్ సిందూర్, పేరుతో ఉగ్రమూకల అంతు చూసింది ఇండియన్ ఆర్మీ. మే 7వ తేదీన తెల్లవారుజామున 1:05 నుంచి 1:30 గంటల వరకు భారత సైన్యం, నావికాదళం, వైమానిక దళం సంయుక్తంగా ఆపరేషన్ సిందూర్ నిర్వహించాయి. కేవలం 24 నిమిషాల్లోనే ఉగ్రమూకల స్థావరాలను నేలమట్టం చేశాయి.
ఇండియన్ ఆర్మీ దెబ్బకు ఉగ్రవాదులు కకావికలం, 24 క్షిపణలు ఏక కాలంలో ఎటాక్ చేయడంతో ఉగ్రవాదులు కకా వికలం అయ్యారు. పేలుడు సంభవించిన సమీపంలోని ఉగ్ర వాదులు భయంతో అటూ ఇటూ పరుగులు తీయడం ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో.. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి, కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌తో కలిసి మాట్లాడుతూ ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా ఈ ఆపరేషన్ జరిగిందని అన్నారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలు జరిపిన దాడిలో ఒక నేపాలీ జాతీయుడు సహా 26 మంది ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడ్డారు. దీనికి ప్రతిచర్యగానే, ఈ అటాక్ అని స్పష్టం చేశారు.
ఈ ఆపరేషన్ వ్యూహంలో మార్పును సూచిస్తుందని కల్నల్ ఖురేషి అన్నారు. గత మూడు దశాబ్దాలుగా, పాకిస్తాన్ పీవోజేకే, పాకిస్తాన్ అంతటా రిక్రూట్‌మెంట్ కేంద్రాలు, శిక్షణా ప్రాంతాలు, లాంచ్ ప్యాడ్‌లు వంటి ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నిర్మిస్తోంది. ఈ ఆపరేషన్ ఆ సౌకర్యాలను కూల్చివేసి భవిష్యత్తులో దాడులను నిరోధించడానికి ఉద్దేశించింది అని ఆమె చెప్పారు. భారతదేశంపై మరిన్ని దాడులు జరగబోతున్నాయని మా నిఘా వర్గాలు సూచించాయి. అందుకే.. ఈ ఉదయం ఉగ్రవాద నిర్మూలనా ఆపరేషన్ చేపట్టాం. మా హక్కును మేము ఉపయోగించుకున్నాం. మా చర్యలు తీవ్రతరం కానివి. బాధ్యతాయుంగా ఉన్నాయి. ఉగ్రవాదుల మౌలిక సదుపాయాలను కూల్చివేయడంపైనే దృష్టిసారించడం జరిగింది. అని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అన్నారు.
దాడులు జరిగిన ఉగ్రస్థావరాలివే:
ముజఫరాబాద్, కోట్లి, బహవల్పూర్, రావలకోట్, చక్స్వారీ, భీంబర్, నీలం వ్యాలీ, జీలం, చక్వాల్‌లోని ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఆర్మీ దాడులు చేసింది. ఇవన్నీ ఉగ్రవాద శిబిరాలకు స్థావరాలుగా నిఘా సంస్థలు చాలా కాలంగా అనుమానిస్తున్నాయి. ఈ ప్రదేశాలు లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ లతో అనుబంధంగా ఉన్నాయని బలమైన ఆధారాలు కూడా ఉన్నాయి. ఈ రెండు ఉగ్రవాద సంస్థలు భారతదేశంలో అనేక సంవత్సరాలుగా దాడులకు పాల్పడ్డాయి. ఇక దాడికి గురైన తొమ్మిది ప్రదేశాలలో ఐదు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉన్నాయి. నాలుగు పాకిస్తాన్ ప్రధాన భూభాగంలో ఉన్నాయి. ముఖ్యంగా బహవల్పూర్ జెఎంకు బలమైన కోటగా ప్రసిద్ధి చెందింది. ముజఫరాబాద్, భీంబర్‌లను గతంలో భారత భద్రతా సంస్థలు కాశ్మీర్‌లోకి చొరబడటానికి రవాణా, లాజిస్టిక్స్ పాయింట్లుగా గుర్తించాయి. ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం.. ఆపరేషన్ సిందూర్ సూపర్ సక్సెస్ అయ్యింది. లక్షిత స్థావరాలన్నీ ధ్వంసమయ్యాయి. శిక్షణా శిబిరాలు, ఆయుధ గోదాములు, స్టేజింగ్ సౌకర్యాల ధ్వంసమైనట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. ఆపరేషన్ సిందూర్ విస్తృతంగా జరిగినప్పటికీ.. పాకిస్తాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదు.
భారీ నష్టం:
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో 70 మందికి పైగా ఉగ్రవాదులు మరణించగా, 60 మందికి పైగా గాయపడ్డినట్లు సమాచారం. భూమి నుండి, ఆకాశం నుండి ప్రయోగించే క్షిపణులను ఉపయోగించి భారత్ ఈ దాడులు చేసింది. నిఘా డ్రోన్‌ల ద్వారా రియల్ టైమ్ పర్యవేక్షణ.. తక్కువ పౌరుల ప్రాణనష్టంతో లక్ష్య చేధనను నిర్ధారించబడటానికి వీలు కల్పించిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »