నిర్దేశం, హైదరాబాద్ః సినీ నటుడు అల్లు అర్జున్ ని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పుష్ప2 సినిమా విడుదలకు ఒక రోజు ముందు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ లో నిర్వహించిన బెనిఫిట్ షోకు అల్లు అర్జున్ వచ్చారు. ఆ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించింది. ఆమె కుమారుడు ఆసుపత్రి పాలయ్యాడు. ఈ విషయమై.. సరైన ఏర్పాట్లు చేయకుండా ఒకరి మరణానికి కారణమయ్యారంటూ అల్లు అర్జున్ ని శుక్రవారం మద్యాహ్నం 12గంటలకు ఆయన నివాసంలో అరెస్ట్ చేశారు. అయితే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడానికి కారణాలు ఇవి కావని.. దీని వెనుక చంద్రబాబు, పవన్ కల్యాణ్, రేవంత్ రెడ్డి వ్యక్తిగతమైన కక్షలున్నాయని నెటిజెన్లు అంటున్నారు.
మూడు కారణాల వల్ల అల్లు అర్జున్ అరెస్టయ్యారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. అందులో మొదటిది.. టీడీపీకి వ్యతిరేకంగా పని చేయడం. ఆంధ్రప్రదేశ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో నంద్యాలలో వైయస్ఆర్సీపీ అభ్యర్థికి అనుకూలంగా అల్లు అర్జున్ ప్రచారం చేశారు. ఇది చంద్రబాబుకు కోపం తెప్పిందట. అందుకే తాజా కేసులో తన శిష్యుడైన రేవంత్ రెడ్డికి గట్టి యాక్షన్ తీసుకొమ్మని చెప్పినట్లు నెటిజెన్లు అంటున్నారు. ఇక మెగా కాంపౌండ్ లో చాలా కాలంగా మెగా హీరోలతో అల్లు అర్జున్ కు పడటం లేదు. దీనిపై ఇరు పక్షాలు పలుమార్లు బహిరంగంగా స్పందించారు కూడా. ఇక పుష్ప2 సినిమా సందర్భంగా కూడా ఇరు వర్గాల మధ్య అనేక వాగ్వాదాలు జరిగాయి. అందుకే పవన్ కల్యాణ్ రంగంలోకి దిగారని, పవన్ విజ్ణప్తి మేరకు సీఎం రేవంత్ స్పందించి అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసినట్లు కూడా నెటిజెన్లు అంటున్నారు.
ఇక మూడవ అంశం ఏంటంటే.. ఈసారి నేరుగా రేవంత్ రెడ్డికి కోపం తెప్పించిన విషయం. పుష్ప2 సక్సెస్ మీట్ లో తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ణతలు చెప్తున్న సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారు అల్లు అర్జున్. మర్చిపోయారా, గుర్తులేదా తెలియదు కానీ, పక్కన ఉన్నవారు చెప్పే వరకు స్టేజి మీదే నీళ్లు నమిలారు. ఇది బాగా ట్రోలైంది. స్వయంగా కేటీఆర్ కూడా ఓ సందర్భంలో దీన్ని ప్రస్తావిస్తూ రేవంత్ రెడ్డిని ఎద్దేవా చేశారు. ఈ మొత్తం ఘటన రేవంత్ రెడ్డిని కోపానికి గురి చేసిందని.. అందుకే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసినట్లు నెటిజెన్లు అంటున్నారు.