నిర్దేశం, హైదరాబాద్ః 2024 ఏడాది అనేది చరిత్రలో అత్యంత వేడిగా ఉండే సంవత్సరంగా రికార్డుకెక్కిందని యూరోపియన్ యూనియన్‌కు చెందిన కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ వెల్లడించింది. జనవరి నుండి నవంబర్ వరకు సగటు ప్రపంచ ఉష్ణోగ్రత పారిశ్రామిక పూర్వ యుగం (1850-1900) కంటే 1.5 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైంది. దీనికి ముందు 2023 ఏడాది కూడా హాటెస్ట్ ఇయర్‌గా నమోదైంది. ఇక ఈ యేడాది దాన్ని మించిపోయింది. ఈ పెరుగుతున్న వేడి మానవుల వల్ల కలిగే వాతావరణ మార్పుల ప్రత్యక్ష ఫలితమని నిపుణుల అభిప్రాయపడుతున్నారు.
ఈ సంవత్సరం, ప్రపంచవ్యాప్తంగా భయంకరమైన ప్రకృతి వైపరీత్యాలు కనిపించాయి. ఇటలీ, దక్షిణ అమెరికాలో కరువు సంభవించింది. అయితే వరదలు నేపాల్, సూడాన్, ఐరోపాలను ముంచెత్తాయి. మెక్సికో, మాలి, సౌదీ అరేబియాలో వేడిగాలుల కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో తుపానులు విధ్వంసం సృష్టించాయి. వాతావరణ మార్పుల వల్ల భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
కోపర్నికస్ వాతావరణ నిపుణుడు జూలియన్ నికోలస్ హెచ్చరిక
చాలా చిత్రంగా చలికాలం స్టాటయ్యే నవంబర్ నెలలో కూడా అసాధారణ వేడి కొనసాగింది. కోపర్నికస్ అనే వాతావరణ నిపుణుడు జూలియన్ నికోలస్ మాట్లాడుతూ.. ఉష్ణోగ్రత నిరంతరం పెరుగుతోందని, భవిష్యత్తులో ఈ పరిస్థితి మరింత తీవ్రమవుతుందని హెచ్చరించారు. పెరుగుతున్న శిలాజ ఇంధనాల వినియోగాన్ని, కర్బన ఉద్గారాలను అరికట్టడం చాలా అవసరమని హెచ్చరించారు. ఇలా చేయకపోతే ఏదో ఒకరోజు ప్రపంచం ఎడారిలా మారుతుందని ఆయన అన్నారు.
వచ్చే ఏడాదిపైనే శాస్త్రవేత్తలు దృష్టి
ఎల్ నినో, లా నినా వంటి వాతావరణ పరిస్థితులు ఉష్ణోగ్రతను ప్రభావితం చేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎల్ నినోకు బదులు లా నినా ప్రభావంతో వచ్చే ఏడాది ఉష్ణోగ్రత కాస్త తగ్గే అవకాశం ఉందని లండన్ ఇంపీరియల్ కాలేజీకి చెందిన శాస్త్రవేత్త ఫ్రెడరిక్ ఒట్టో తెలిపారు. పరిస్థితి సాధారణంగా ఉంటుందని దీని అర్థం కాదని కూడా ఆయన అన్నారు. రాబోయే సంవత్సరాల్లో మనం వేడిగాలులు, కరువు, అడవి మంటలు, తుఫాను వంటి విపత్తులను ఎదుర్కొనే అవకాశం ఉందని చెబుతున్నారు.
తక్షణమే చర్యలు తీసుకోవాలి
2024లో కర్బన ఉద్గారాలు రికార్డు స్థాయిలో ఉన్నాయట. చాలా దేశాలు వీటిని తగ్గిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, వాస్తవంలో అది చురుగ్గా జరగడం లేదు. వాతావరణ మార్పుల వల్ల వచ్చే ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి కార్బన్ ఉద్గారాలను సున్నాకి తగ్గించడం చాలా ముఖ్యం. ఈ దిశలో తక్షణమే ఖచ్చితమైన చర్యలు తీసుకోకపోతే, ఇది మొత్తం ప్రపంచానికి వినాశకరమవుతుంది.