10 లక్షలు… గులాబీ ప్లాన్
నిర్దేశం, వరంగల్ః
ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 10లక్షలు. అంతకు మించి అయినా పర్వాలేదు గాని లెక్క మాత్రం తక్కువ కాకూడదు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నేతలకు ఫిక్స్ చేసిన టార్గెట్ ఇది. ఈ నెల 27న వరంగల్ లో నిర్వహిస్తున్న పార్టీ సిల్వర్ జూబ్లీ సభకు 10 లక్షల జన సమీకరణ చేయాలని గులాబీ బాస్ ఆదేశించారంట. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వరంగల్ కు 10 లక్షల మంది జనాన్ని తరలించగలమా అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారట గులాబీ పార్టీ నేతలు.గులాబీ పార్టీ రజతోత్సవ సంబురాలకు సిద్దమవుతోంది. పార్టీ 24 ఏళ్లు పూర్తి చేసుకుని 25వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్బంగా ఈ నెల 27న వరంగల్‌లో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది.
ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో జిల్లాల వారిగా నిర్వహించిన సన్నాహక సమావేశాల్లో లీడర్లకు దిశానిర్దేశం చేసిన కేసీఆర్ 10 లక్షల మందితో రజతోత్సవ సభను గ్రాండ్ సక్సెస్ చేయాలని ఆర్డర్ పాస్ చేశారంట. అధికారంలో లేకపోయినా భారీ జన సమీకరణతో కనీవినీ ఎరుగని రీతిలో బహిరంగ సభను నిర్వహించి పార్టీ సత్తా ఏంటో నిరూపించాలని చెప్పారంట కేసీఆర్. దీంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా జిల్లా పర్యటనలు చేసి మరీ ఓరుగల్లు సభకు సన్నాహాలు చేస్తున్నారు.. మరోవైపు హరీష్ రావు, కవిత సైతం సైతం రంగంలోకి దిగారు.ఇంతవరకు బాగానే ఉన్నా.. వరంగల్ సభకు జన సమీకరణపైనే పార్టీ వర్గాల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయట.
ఒక్కో నియోజకవర్గం నుంచి 10వేల మంది జనాన్ని తరలించేలా ప్లాన్ చేస్తున్నారట. అయితే కనీసం 3వేల నుంచి 5వేల మందిని తరలించడం కూడా కష్టమేననే టాక్ వినిపిస్తోందట. అలా ఒక్కో నియోజకవర్గం నుంచి 5వేల మందిని తరలించినా 100 నియోజకవర్గాలకు 5 లక్షల మందే అవుతారు. కానీ కేసీఆర్ టార్గెట్ ఫిక్స్ చేసింది 10 లక్షల జనసమీకరణ కోసం.మరి అంత మందిని వరంగల్ సభకు ఎలా తరలించాలనేది అర్థంకాక తలలు పట్టుకుంటున్నారంట గులాబీ పార్టీ నేతలు. అందులోనూ మెజార్టీ ఎమ్మెల్యేలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉన్నారని..హైదరాబాద్ నుంచి జనాన్ని తరలించడం సాధ్యం కాదని సిటీ ఎమ్మెల్యేలు ఇంటర్నల్ గా చెబుతున్నారట.
అసలే సమ్మర్ సీజన్ కావడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి సైతం జనాన్ని తరలించడం అంత ఈజీ కాదని అంటున్నారంట. ఐతే ఏ గ్రామం నుంచి ఎంత మంది వస్తారో ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుని,..వచ్చే వాళ్లు చేజారిపోకుండా సభకు తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నారట గులాబీ లీడర్లు.10 లక్షల మందితో వరంగల్ సభను గ్రాండ్ సక్సెస్ చేయాలని టార్గెట్ ఫిక్స్ చేసిన కేసీఆర్.. జనసమీకరణ బట్టే నియోజకవర్గాల్లో నాయకుల సత్తా ఏంటో తెలుస్తుందని చెప్తున్నారంట. రాబోయే రోజుల్లో పార్టీ పదవులు, ఎన్నికల్లో టిక్కెట్లు, మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టుల వంటి వాటిని పరిగణలోకి తీసుకుంటామని పరోక్షంగా స్పష్టం చేస్తున్నారని పార్టీవర్గాల్లో చర్చ జరుగుతోంది. అందుకే వరంగల్ సిల్వర్ జూబ్లీ సభకు భారీ ఎత్తున జనాన్ని తరలించి తమ సత్తా చాటుకోవాలని నేతలు ప్రయత్నిస్తున్నారంట. మరి గులాబీ బాస్ కేసీఆర్ ఇచ్చిన టార్గెట్ ను పార్టీ నేతలు రీచ్ అవుతారా లేదా అన్నది తెలియాలంటే ఈనెల 27 వరకు ఆగాల్సిందే.
నిర్ణయం చెప్పండి
వరంగల్ జిల్లా హనుమకొండలో బీఆర్ఎస్ నిర్వహించతలపెట్టిన రజతోత్సవ సభపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. హనుమకొండలో సభకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదంటూ బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించగా.. విచారణ జరిపి కోర్టు.. ప్రతివాదులకు కీలక ఆదేశాలు ఇచ్చింది.ఈనెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హనుమకొండలోని ఎల్కతుర్తిలో రజతోత్సవ సభ నిర్వహించాలని బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించింది. భారీ ఎత్తున సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో ఉదయం 10గంటల నుంచి రాత్రి 10గంటల వరకు సభ నిర్వహిస్తామని, అందుకు అనుమతి ఇవ్వాలని వరంగల్ పోలీసులను బీఆర్ఎస్ ఆశ్రయించింది.
అయితే, అందుకు పోలీసుల నుంచి అనుమతి రాకపోవటంతో బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై ఈ ఇవాళ కోర్టులో విచారణ జరిగింది. సభకోసం బీఆర్ఎస్ పెట్టుకున్న పర్మిషన్ ను అనుమతించక పోవటం, దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవటం వల్లనే హైకోర్టులో పిటిషన్ వేసినట్లు బీఆర్ఎస్ తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు.హోంశాఖ ముఖ్య కార్యదర్శి, వరంగల్ సీపీ, కాజీపేట ఏసీపీని బీఆర్ఎస్ ప్రతివాదులుగా చేర్చింది. దీంతో ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయడానికి హోంశాఖ తరపు న్యాయవాది సమయం కోరారు. ఈనెల 21 వరకు గడువు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన కోర్టు ఈనెల 17 నాటికి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.