10 లక్షల ఎకరాల పంట ఎండినా పట్టింపే లేదు
– కాల్వల్లో నీళ్లున్నా ఎందుకు వదలడం లేదు
– కష్టాల్లో ఉన్న రైతాంగానికి ఆదుకునే చర్యలు చేపట్టండి.
– కేంద్రమంత్రి, బండి సంజయ్ ఫైర్
నిర్దేశం, హైదరాబాద్ః
అన్నదాతల ఆక్రందనలు విన్పించడం లేదా అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంవల్ల రాష్ట్రంలో పంటలు ఎండి పోతున్నాయన్నారు. “రాష్ట్రవ్యాప్తంగా 56 లక్షల ఎకరాల్లో వరి, 7 లక్షల ఎకరాల్లో మొక్కొజొన్న పంటలు వేసినప్పటికీ.. ఆయా పంటలకు తగిన సమయంలో నీటిని వదలక పోవడంవల్ల ఇప్పటికే దాదాపు 10 లక్షల ఎకరాల మేరకు పంట ఎండిపోయినట్లు మా ద్రుష్టికి వచ్చింది. ముఖ్యంగా ఆయకట్టు చివరి పంటలకు నీళ్లందక పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయి. అయినా ప్రభుత్వ యంత్రాంగం రైతులను ఆదుకునేందుకు, పంటలను కాపాడేందుకు చర్యలు తీసుకోకపోవడం బాధాకరం” అని అన్నారు.
వాస్తవానికి ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు కురిసి ప్రాజెక్టులు, చెరువులు నిండిపోయాయి. ఫలితంగా వానా కాలంలో రికార్డు స్థాయిలో అంటే 160 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా వరి ధాన్యం దిగుబడి వచ్చింది. నీటి లభ్యతను ద్రుష్టిలో ఉంచుకుని యాసంగి లోనూ 56లక్షల ఎకరాల్లో వరి, మరో 7 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంటలు వేశారు. వీటితోపాటు జొన్న, పప్పుదాన్యాలు, నూనెగింజల పంటలు కూడా వేశారు.
యాసంగి పంటలు వేసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. యాసంగిలో ఏ ప్రాంతంలో ఏ పంట వేయాలనే అంశానికి సంబంధించి ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను కూడా వ్యవసాయ శాఖ అమలు చేయలేదు. మరో నెల రోజుల్లో పంటలు కోతకు రాబోతున్న తరుణంలో పొలాలకు నీరందక పోవడంవల్ల లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. చెరువుల్లో నీరు తగ్గడంతో భూగర్భ జలాలు పడిపోయి బావులు, బోర్ల కింద పంటలన్నీ ఎండి నేలరాలుతున్నాయని బండి సంజయ్ అన్నారు.