జిల్లా కలెక్టర్లు, ఎస్.పి లతో సి.ఎస్ శాంతి కుమారి టెలీ కాన్ఫరెన్స్


తెలంగాణ రన్, మహిళా, వైద్య. ఆరోగ్య దినోత్సవాల నిర్వహణ పై

జిల్లా కలెక్టర్లు, ఎస్.పి లతో సి.ఎస్ శాంతి కుమారి టెలీ కాన్ఫరెన్స్

హైదరాబాద్, జూన్ 11 :: తెలంగాణా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని సోమవారం నిర్వహించే తెలంగాణా రన్, తదుపరి రోజుల్లో నిర్వహించాల్సిన మహిళా దినోత్సవం, వైద్య ఆరోగ్య దినోత్సవాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ సూపరింటెండెంట్లతో నేడు సాయంత్రం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలి కాన్ఫరెన్స్ లో డీజీపీ అంజనీ కుమార్, యువజన సంక్షేమం, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి భారతి హోలికేరి , సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కార్యదర్శి అశోక్ రెడ్డి, మున్సిపల్ పరిపాలన శాఖ కమీషనర్ సత్యనారాయణ, రాచకొండ పోలీస్ కమీషనర్ చౌహాన్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఈ క్రింది ఆదేశాలను సి.ఎస్ శాంతి కుమారి జిల్లా కలెక్టర్లు, ఎస్.పి లకు జారీ చేశారు.

తెలంగాణా రన్
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల కేంద్రాల్లో అత్యంత ఘనంగా తెలంగాణా రన్ నిర్వహించాలి. ఈ రన్ లో ప్రజాప్రతినిధులు, యువత, స్వచ్ఛంద సంస్థలు, కళాశాల విద్యార్థినీ, విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యే విధంగా చర్యలు చేపట్టాలి. ప్రారంభోత్సవం వేదిక వద్ద మంచి డయాస్ వేసి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలి. టీ-షైర్ట్ లు, జెండాలు, క్యాపులు అందించాలి. పండగా వాతావరణంలో అన్ని వర్గాల ప్రజలు ఈ తెలంగాణా రంలో పాల్గొనే విధంగా చర్యలు చేపట్టాలి.
హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ .బీ.ఆర్. అంబేద్కర్ విగ్రహం పక్కనే ఉన్న మైదానంనుండి ఉదయం 6 గంటలకు రన్ ప్రారంభమవుతుంది. ఈ రన్ లో దాదాపు నాలుగు నుండి ఐదు వేల మంది పాల్గొంటారు. రన్ లో పాల్గొనే వారికి టీ-షర్ట్స్, క్యాపులను అందించాలి. ఈ రన్ కు హైదరాబాద్ నుండి ప్రాతినిధ్యం వహించే మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతారు. ప్రతీ నియోజక వర్గాల కేంద్రాల్లో జరిగే ఈ తెలంగాణా రన్ లను మంత్రులు, ప్రజాప్రతినిధులచే ఫ్లాగ్ ఆఫ్ చేయించాలి.

12 న మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించాలి
ఏ నెల 12 వ తేదీన మహిళా దినోత్సవాన్ని అన్ని జిల్లా, నియోజక వర్గ కేంద్రాల్లో ఘనంగా నిర్వహించాలని సి.ఎస్ శాంతి కుమారి పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలకు జిల్లాలోని అంగన్ వాడి, ఆశా కార్యకర్తలందరూ హాజరవ్వాలి. ఈ సందర్బంగా ఆరోగ్య లక్షి, న్యూట్రిషన్ కిట్ లు, వివిధ స్టాళ్లను ఏర్పాటు చేయాలి. న్యూట్రిషన్ కిట్ లు మహిళల ఆరోగ్యానికి ఎలా తోడ్పడుతాయన్న విషయాన్ని వివరించాలి. మహిళలు, మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం కల్పించిన ప్రత్యేక సదుపాయాలను వివరించాలి. మెమెంటోలు, సర్టిఫికెట్లట్లు, ఇతర బహుమతులను అందచేయాలి. రాష్ట్ర రాజధాని కేంద్రంలో ఘనంగా నిర్వహించి మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలి.

14 న వైద్య. ఆరోగ్య దినోత్సవం

దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈ నెల 14 వ తేదీన హైదరాబాద్ తో పాటు, అన్ని జిల్లా నియోజక వర్గ కేంద్రాల్లో పండగ వాతావరణంలో వైద్య ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలియ చేశారు. ఈ సందర్బంగా రాష్ట్రంలోని 24 జిల్లాల్లో న్యూట్రిషన్ కిట్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక వైద్య కేంద్రాలు, సబ్ సెంటర్లు, అర్బన్ సెంటర్లలలో పండగ వాతావరణం నెలకొనేలా చూడాలన్నారు. హైదరాబాద్ లో నిమ్స్ విస్తరణ కార్యక్రమానికి ఎర్ర మంజిల్ లో రాష్ట్ర ముఖ్య మంత్రి శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. జిల్లా కేంద్రాల్లో కనీసం వెయ్యి మందికి పైగా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆశా, అంగన్ వాడి, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది మొత్తం ఈ కార్యక్రమానికి హాజరయ్యేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. గత తొమ్మిదేళ్లలో జిల్లాలో వైద్య ఆరోగ్య రంగంలో వచ్చిన మార్పులు, అభివృద్ధి కార్యక్రమాలు , కొత్త మెడికల్ కాలేజీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇతర అధివృద్ది కార్యక్రమాలను తెలియ చేయాలన్నారు.. వైద్య ఆరోగ్య శాఖ చేపట్టిన పథకాలపై ప్రత్యేకంగా స్టాళ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఉత్తమ ఉద్యోగులు, కార్యకర్తలను గుర్తించి వారికి మెమెంటోలు, సర్టిఫికెట్లు, చీరెలు, మెమెంటోలను బహూకరించాలన్నారు.

జెడ్పి చైర్మన్ మరణంతో ములుగు జిల్లాలో తెలంగాణా రన్ వాయిదా

ములుగు జిల్లా పరిషత్ ఛైర్మెన్ కుసుమ జగదీశ్ ఆకస్మిక మరణంతో రేపు (12 వ తేదీన) ములుగు జిల్లాలో నిర్వహించాల్సిన తెలంగాణా రన్ ను వాయిదా వేయాలని ములుగు జిల్లా కలెక్టర్ కు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. అయితే, ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీశ్ మరణించడంతో ములుగు జిల్లాలో తెలంగాణా రన్ ను వాయిదా వేయాలని రాష్ట్ర ముఖ్య మంత్రి ఆదేశించినందున, ఈ జిల్లాలో తదుపరి ఎప్పుడు నిర్వహించేది తెలియచేయగలమని సి.ఎస్ అన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్, ఎస్.ఫై లకు ఆదేశాలు జారీ చేశారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *