ప్రభుత్వ ఉద్యోగుల గొప్ప మనసు.. వరద బాధితులకు రూ.100 కోట్ల విరాళం
బాధితులకు సాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వానికి అండగా.. కొందరు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆర్థిక సాయం అందిస్తున్నారు
నిర్దేశం, హైదరాబాద్: భారీ వర్షాల కారణంగా తెలంగాణలో వరదలు పొటెత్తుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాలు చాలా దెబ్బతిన్నాయి. వందలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ముఖ్యంగా మున్నేరు వారు ఉపొంగి ఖమ్మం నగరం వరద దిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో బాధితులను ఆదుకునేందుకు దాతలు ముందుకొస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని విభాగాల ప్రభుత్వ ఉద్యోగుల సైతం సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.
బాధితులకు సాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వానికి అండగా.. కొందరు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ గొప్ప మనసు చాటుకుంది. రాష్ట్రంలోని ఉద్యోగుల తరుపున ఒక రోజు వేతనం.. అంటే సుమారు రూ.100 కోట్లను ప్రభుత్వానికి ఇచ్చేందుకు స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకున్నట్లు జేఏసీ ఛైర్మన్ లచ్చిరెడ్డి ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వానికి తమ వంతు సహకారం అందిస్తున్నామని తెలిపారు. వరద బాధితులకు అండగా నిలుస్తామన్నారు.
తెలంగాణలోని అన్ని ప్రభుత్వ విభాగాలలోని ఉద్యోగుల తరఫున సమిష్టి నిర్ణయం తీసుకున్నట్లు లచ్చిరెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా ఉన్న ఉద్యోగులుగా వరద విపత్తు సృష్టించిన ప్రాంతాలలో ప్రత్యక్షంగా సహాయక చర్యల్లో పాల్గొనడంతో పాటు తమ బాధ్యతగా ఒక రోజు వేతనాన్ని విరాళంగా అందచేయనున్నట్టుగా చెప్పారు. సహాయక చర్యల్లో నిమగ్నమైన ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగులు సైతం అండగా నిలుస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని విభాగాల ప్రభుత్వ ఉద్యోగులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారని ఆయన గుర్తు చేశారు.