‘బూతు’ బంగళాలా తెలంగాణ అసెంబ్లీ?
ఆనాది నుంచి మేమే అన్న అహంకారం కాంగ్రెస్ నేతలకూ ఉంటుంది. మొదట్లో కాస్త అనుకువగా ఉండేందుకు ప్రయత్నించినా, అనతి కాలంలోనే అదుపు తప్పింది
– కంట్రోల్ తప్పిన కాంగ్రెస్.. సభ్యుల వికృత చేష్టలు, బూతు పురాణాలు
– కనీస విలువలు లేకుండా వ్యవహరిస్తున్న సభ్యులు
– వీటన్నింటికీ ఆధ్యుడు కేసీఆరే
నిర్దేశం, హైదరాబాద్: ఆంధ్రా అసెంబ్లీ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. కుటుంబ సభ్యుల శీల పరీక్షలు, వ్యక్తిగత కక్షలు, బూతులతో దేశంలోనే అత్యంత చెత్త అసెంబ్లీగా నామకరణం చేసుకుంది. అసెంబ్లీలో సభ్యులు మాట్లాడే మాటలు రికార్డ్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది ఎదురైందంటే.. అసెంబ్లీ చర్చలు ఎంత అసహ్యంగా జరిగాయో అర్థం చేసుకవోవచ్చు. చూస్తుంటే తెలంగాణ అసెంబ్లీ పరిస్థితి కూడా అలాగే మారుతున్నట్లు కనిపిస్తోంది. గతంలో లేవని కావు, ఇప్పుడే కొత్తనీ కాదు. కానీ, గతానికి ఘనమైన కొనసాగింపన్నట్లుగా ప్రస్తుత అసెంబ్లీ కనిపిస్తోంది. ఇద్దరు సీఎంలు ఇందుకు బాధ్యులే సుమీ!
దానం నాగేందర్ దరిద్రపు మాటలు
బడ్జెట్ సమావేశాల్లో చివరి రోజైన శుక్రవారం చర్చల్లో భాగంగా కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడిన తీరైతే నా భూతో: నా భవిష్యత్ అనక తప్పదు. విపక్షం అన్నప్పుడు అడ్డుపడుతుంది. అధికారంలో ఉన్నోడు అయితే నచ్చజెప్పడమో లేదంటే డామినేట్ చేయడమో ఉంటుంది. కానీ, దానం అలా కాదు. దండయాత్ర చేయడమే ఆయన అలవాటు. చేతిలో లాఠీ పట్టి నిరసనకారుల్ని కొట్టినా, మైకు పట్టి బూతులు తిట్టినా ఆయనకు ఆయనే సాటి. ఈసారి ఆయన మరో అడుగు ముందుకు వేసి ఏకంగా అసెంబ్లీలోనే బూతు పురాణం అందుకున్నారు.
దానం మాట్లాడుతుండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడ్డుతగిలారు. దీంతో మతిభ్రమించిపోయిన ఆయన ‘హే మూసుకోవోయ్.. నీ అమ్మ.. బయట కూడా తిరగనియ్య కొడకా మిమ్మల్ని.. ఏమనుకుంటున్నార్రా మీరు.. నీ యమ్మ.. తోలుతీస్తా ఒక్కొక్కడిది.. అరేయ్’ అంటూ చెలరేగిపోయారు. తెలంగాణ అసెంబ్లీ చరిత్రలో ఈ మాటలను రేడియంతో చెక్కిపెట్టాలి. 100లో ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి సరిపోయింది కానీ, సభా నాయకుడైతే టాప్ లేపేసేవారు (ఆయన మాటలకు అదే ఎగిరిపోతుందనుకోండి, అది వేరే విషయం).
ఆధ్యుడు కేసీఆర్
తెలంగాణలో అనేక విప్లవాలకు కారకుడు, ఆధ్యుడు కేసీఆర్. తెలంగాణ ఉద్యమాన్ని రాజకీయం చేసి రాష్ట్రం సాధించడంలో ఆయన కీర్తి ఎనలేనిదే. అలాగే తెలంగాణ రాజకీయాల్లో బూతులను గ్లోరిఫై చేయడంలోనూ ఆయనది ప్రత్యేక స్థానమే. విపక్ష నేతలను పట్టుకుని ‘ప్రిపేర్ అయి రాకుంటే, పీకనీకి వచ్చారా?’ అంటూ కేసీఆర్ చేసిన కామెంటుకు ఏ అవార్డు సరితూగదు. అధికార అహంతో అసెంబ్లీలో, పబ్లిక్ మీటింగుల్లో, మీడియా సమావేశాల్లో కేసీఆర్ మాట్లాడిన మాటలు.. తెలంగాణ ప్రజల చెవుల్లో ఇప్పటికీ మోగుతూనే ఉంటాయి. బహుశా.. నేటి నాయకుల తీరుకు ఆదర్శం కేసీఆరే కాబోలు.
కంట్రోల్ తప్పిన కాంగ్రెస్
విపక్షంలో ఉన్నప్పుడు కాస్త నోరుజారితే పట్టించుకోరు కానీ, అధికారంలో ఉన్నప్పుడు అణిగిమణిగి ఉండాలి. అధికారం అంటే పెద్ద కుర్చీ మాత్రమే కాదు. పెద్ద బాధ్యత కూడా. కేసీఆర్ ఓటమికి ప్రధాన కారణం అహంకారం, దురుసుతనమే. మరలాంటప్పుడు కాంగ్రెస్ ఎంత జాగ్రత్తగా ఉండాలి. కానీ, ఉండరే.. ఉంటే కాంగ్రెస్ నేతలు ఎందుకు అవుతారు? ఆనాది నుంచి మేమే అన్న అహంకారం కాంగ్రెస్ నేతలకూ ఉంటుంది. అదే బయటికి వస్తుంది. మొదట్లో కాస్త అనుకువగా ఉండేందుకు ప్రయత్నించినా, అనతి కాలంలోనే అదుపు తప్పింది. స్వయంగా రేవంత్ రెడ్డే అడ్డందొడ్డం మాట్లాడుతూ అనవసరపు గొడవలకు కారణమవుతున్నారు. ఇక పార్టీ నేతలెంతలే.