రేవంత్ రెడ్డి సీఎం కుర్చీకి ఎసరు పెట్టారా?
నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ ఆధిపత్యం తెలియనిది కాదు. బహుశా.. తమలో ఐకమత్యం లేదని అనుకున్నారో ఏమో.. కొంత కాలంగా కలివిడిగా ఉంటున్నారు.
నిర్దేశం, హైదరాబాద్: ఏ పార్టీ లీడర్లైనా వైరి పార్టీలతో తగువులాడుతుంటారు. బహుశా.. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఏకైక రాజకీయ పార్టీ కావచ్చు.. బయటి వారిని వదిలేసి వారిలో వారే తగువులాడుతుంటారు. కలహాలు లేకపోతే కాంగ్రెస్ కాదు. లొల్లి పెట్టుకోకుంటే ఆ పార్టీ నేతలకు పొద్దు పోదు. అయితే ఇవి కొన్నిసార్లు సిల్లీగా ఉంటాయి, కొన్నిసార్లు సీరియస్ గానూ ఉంటాయి. ఎటొచ్చి.. విమర్శకులకు బయటి వారికి రాజకీయ వినోదం పంచడంలో కాంగ్రెస్ పార్టీది జున్నుతో పెట్టిన విద్య.
విషయం ఏంటంటే.. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి అని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదేదో నోరు జారి అన్నదో, మర్చిపోయి అన్నదో అనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలే. రేవంత్ వర్గం వారిని అడిగితే దురుద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలని కూడా అంటారనుకోండి.. అది వేరే విషయం. పలుమార్లు ఎమ్మెల్యే, ఎంపీ అయినా రాజగోపాల్ రెడ్డి రాజకీయ అనుభవం చాలా ఎక్కువ. అలాంటి వ్యక్తి ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారన్నది ఎక్కువ మందిని తొలచివేస్తున్న ప్రశ్న.
ముందుగా చెప్పుకున్నట్టే.. కాంగ్రెస్ లో విబేధాలు ఎక్కువ. కోమటిరెడ్డి బ్రదర్స్ సహా ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా రేవంత్ అంటే పడదు. కానీ, పార్టీలో సీనియర్లను కాదని రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిని చేసింది. ఏం చేస్తారు.. కాంగ్రెస్ లో హైకమాండ్ ఒకటుంటుంది. వారు కమాండ్ చేసినట్లే నాయకులు నడుచుకోవాలి. అలాగే నడుచుకున్నారు. తీరా పార్టీ అధికారంలోకి వచ్చాక మళ్లీ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా హైకమాండ్ ఫైనల్ చేసింది. ఈసారి కష్టమైనా నచుకున్నారు. కానీ, అలా ఎంతో కాలం నడవలేకపోయారు. ఇంత మంది సీనియర్లు తరాలు తరబడి పార్టీని అంటిపెట్టుకుని ఉంటే.. నిన్నగాక మొన్న వచ్చిన వ్యక్తి కుర్చీ తన్నుకుపోతాడా అనే కోపం వారిలో ఉండి ఉంటుంది.
నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ ఆధిపత్యం తెలియనిది కాదు. బహుశా.. తమలో ఐకమత్యం లేదని అనుకున్నారో ఏమో.. కొంత కాలంగా నల్లగొండ కాంగ్రెస్ నేతలు కలివిడిగా ఉంటున్నారు. అంతే కాదు.. పీసీసీ చీఫ్, సీఎం కుర్చీలపై తన కోరికను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పలుమార్లు బహిరంగంగానే వెల్లడించారు. అటువంటిది.. తన సోదరుడిని కాదని ఉత్తమ్ కుమారే ఉత్తముడని రాజగోపాల్ రెడ్డి కితాబులివ్వడం తమ ఐకత్యను చాటుతోంది. ఇక తన నాలుక మీద మచ్చలున్నాయని, తాను చెప్పింది నిజమై తీరుతుందని అనడం చూస్తే.. అండర్ గ్రౌండ్ లో గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టే కనిపిస్తోంది.