నిర్దేశం, న్యూఢిల్లీ: భారత రాజకీయాల్లో రాహుల్ గాంధీని పప్పూ అని విమర్శకులు అంటారు. ఈ మాటకు నొచ్చుకున్న రాహుల్.. ఏకంగా పార్లమెంటులో మోదీని కౌగిళించుకుని ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ, వర్కౌట్ కాలేదు. నిజానికి ఇలాంటి కామెంట్స్ కి రియాక్ట్ కాకూడదు. కానీ, కాంగ్రెస్ నేతలు అవుతారు. రాహుల్ పప్పూ కాదంటూ.. ఆ మాటను మళ్లీ మళ్లీ గుర్తు చేస్తూనే ఉంటారు. బహుశా.. విపక్ష నేతల కంటే సొంత పార్టీ నేతల మాటలే దీనికి మరింత బలాన్ని ఇచ్చుండొచ్చు.
సరే, విషయంలోకి వస్తే.. ప్రతి వ్యక్తికి పరిణితి అనేది ఉంటుంది. సహజంగా అది వయసు ద్వారానో అనుభవం ద్వారానో వస్తుంటుంది. కానీ, రాహుల్ కు మాత్రం ఈ రెండింటికీ దశాబ్దాలు గడిచిపోతున్నా రావడం లేదు. ప్రస్తుతం ఆయన ప్రతిపక్ష నేత. అయినా కూడా ఆయన ప్రవర్తనలో అస్సలు మార్పు కనిపించడం లేదు. రాహుల్ ఎంతో ఎదిగారని పొగడ్తు వచ్చే లోపే.. ‘‘లేదు, లేదు.. నేను పప్పూనే’’ అని స్వయంగా రాహులే నిరూపించుకుంటారు. యుద్ధం తూర్పున జరిగితే, రాహుల్ పశ్చిమం వైపు ఆయుధాలు తీసుకుని వెళ్తారని ప్రశాంత్ కిశోర్ ఎద్దేవా చేశారంటే.. రాజకీయాల్లో రాహుల్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
తాజాగా అమెరికా పర్యటనలో రాహుల్ నోటి నుంచి రెండు ఆణిముత్యాలు వచ్చాయి. ఒకటి.. ఇండి కూటమి గురించి, రెండోది రిజర్వేషన్ల గురించి. ముందుగా ఇండీ కూటమి గురించి మాట్లాడుకుందాం. ఇండియా స్పెలింగ్ వచ్చేలా ఇండీ కూటమికి పేరు పెట్టారు. ఈ మొత్తాన్ని అబ్రివేషన్ లో పిలిస్తే ఇండీయా అవుతుంది. కానీ కూటమి అనాల్సి వస్తే ఇండీ అలయన్స్ అనాలి. ఇదే విషయాన్ని ఒకరు అడిగారు. ‘‘లేదు.. లేదు.. ఇండీ కూటమి అని బీజేపీ తప్పుగా ప్రచారం చేస్తోంది. వాస్తవానికి ఇది ఇండియా కూటమి అన్నారు’’ రాహుల్. మరి ఇండియా స్పెలింగులో ఉన్న ‘ఐ’ అర్థమేంటని అడగ్గానే నోరెల్లబెట్టారు.
ఇక రిజర్వేషన్ల అంశంపై రాహుల్ సంధించిన విషయం కంటే స్పందించిన తీరు ఆయనను పప్పులో కాలేసేలా చేసింది. కొంత కాలంగా అగ్ర కులాలు నిమ్న కులాలు ముంచేశాయంటూ నిప్పులు చెరుగుతున్న రాహుల్ గాంధీ.. అదే అమెరికాలో జరిగిన సమావేశంలో సరైన టైం చూసి ఇండియాలో రిజర్వేషన్లను తొలగించే ఆలచోన కాంగ్రెస్ చేస్తోందని అన్నారు. వాస్తవానికి దీనికి ముందు వెనక మాట్లాడినప్పటికీ, అది లెక్కలోకి ఎవరూ తీసుకోలేదు. ఆయన ఉద్దేశం ఎలాంటిదైనా సరే.. బహుశా అంత పెద్ద నాయకుడి నుంచి ఇలాంటి స్టేట్మెంట్ వివాదాన్నే మిగిల్చుతుంది.
బహుజన్ సమాజ్ పార్టీ సుప్రెమో మాయావతి రంగంలోకి దిగి నిప్పులు చెరిగారు. దేశంలో రిజర్వేషన్లను కాంగ్రెస్ అడ్డుకున్న సందర్భాలను గుర్తు చేస్తూ.. కాంగ్రెస్ పార్టీ అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలను గట్టిగానే వేసుకున్నారు. ఇక చాలా మంది విపక్ష నేతలు సహా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సంఘాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో.. తేరుకున్న రాహుల్ గాంధీ.. రిజర్వేషన్ తొలగించడం కాదు, 50 శాతానికి పెంచడమే కాంగ్రెస్ లక్ష్యమంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. కానీ, ఏం లాభం? అప్పటికే జరగాల్సిన డ్యామేజీ అంతా జరిగిపోయింది.