నిర్దేశం, ముంబైః చట్ట ప్రకారం నిషేధం ఉన్నప్పటికీ.. కట్నం అనేది సర్వసాధారణంగా కొనసాగుతున్న తంతు. అయితేఏ కట్నంగా ఇల్లో, కారో ఇస్తారు. పేదవారైతే ఓ మోటర్ సైకిల్ ఇస్తారు. అయితే ఒక నగరాన్ని మొత్తం కట్నంగా ఇచ్చిన విషయం మీకు తెలుసా? మన దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైని ఒకప్పుడు బ్రిటీషు వారికి కట్నంగా ఇచ్చేశారు. దేశ చరిత్రకు సంబంధించిన ఈ ఆసక్తికరమైన విషయం ఎప్పుడు జరిగింది? ఎలా జరిగిందో తెలుసుకుందాం.
బ్రిటీష్ వారికి ముంబై ఎలా కట్నంగా ఇచ్చారు?
పోర్చుగీస్ యాత్రికుడు వాస్కోడగామా 16వ శతాబ్దంలో భారతదేశానికి వచ్చాడు. వచ్చీ రాగానే ముంబై దీవిని జయించి దానికి బొంబాయి అని పేరు పెట్టాడు. పోర్చుగీసువారు ఇక్కడ కోటను నిర్మించి వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించారు. అయితే 17వ శతాబ్దంలో ఇంగ్లాండ్ రాజు చార్లెస్ II పోర్చుగల్‌కు చెందిన బ్రగాంజా యువరాణి కేథరీన్‌ను వివాహం చేసుకున్నాడు. ఈ వివాహంలో బొంబాయి నగరాన్ని ఇంగ్లండ్‌కు పోర్చుగల్ కట్నంగా ఇచ్చింది. ఈ ఒప్పందం 1661 లో జరిగింది.
ఇరు దేశాల మధ్య రాజకీయ సంబంధాలను బలోపేతం చేసేందుకు ఈ వివాహం జరిగింది. ఆ సమయంలో బొంబాయి ఒక ముఖ్యమైన వాణిజ్య కేంద్రం. ఈ ఒప్పందం ఇంగ్లండ్‌కు పెద్ద విజయాన్ని అందించింది. ఎందుకంటే, భారత్‌లో బ్రిటిషర్లు స్థిరపడేందుకు బాగా ఉపయోగపడింది.
ముంబైని వ్యాపార కేంద్రంగా మార్చిన బ్రిటిషర్లు
బ్రిటీష్ వారు బొంబాయిని తమ ఆధీనంలోకి తీసుకొని దానిని ప్రధాన వ్యాపార కేంద్రంగా మార్చారు. ఓడరేవును అభివృద్ధి చేశారు. అనేక పారిశ్రామిక యూనిట్లను స్థాపించారు. క్రమంగా బొంబాయి భారతదేశంలో ముఖ్యమైన నగరంగా మారింది. అయితే, స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం, 1995 సంవత్సరంలో బొంబాయి పేరు ముంబైగా మార్చారు. నేడు మన దేశంలో ముంబై అతిపెద్ద నగరం, అలాగే ఆర్థిక రాజధాని. అలాగే సినిమా పరిశ్రమకు, ఆర్థిక సేవలకు, వాణిజ్యానికి కేంద్రంగా ఉంది. పోర్చుగీస్, బ్రిటిష్ పాలన కూడా ముంబై యొక్క గొప్ప వారసత్వానికి దోహదపడింది.