నిర్దేశం, హైదరాబాద్: అక్రమ నిర్మాణాల కూల్చివేతతో హాట్ టాఫిక్‌గా మారిన హైడ్రా ఎక్కడా తగ్గటం లేదు. ఎవరైతే నాకేంటి అంటూ హైడ్రా అధికారులు కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. తాజాగా.. నగరంలోని మాదాపూర్‌లో నాగార్జునకు చెందిన ఎన్ కన్వేషన్‌ను హైడ్రా అధికారులు పూర్తిగా నేలమట్టం చేశారు. హైటెక్ సిటీ సమీపంలో ఉన్న తుమ్మిడికుంట చెరువులో 3 ఎకరాల 30 గుంటల భూమిని ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ కట్టారని ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. తాజాగా హైడ్రాకు మరోసారి ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులు పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. చెరువు ఆక్రమణకు గురైనట్టు నిర్ధారించి కూల్చివేతలకు ఆదేశాలు ఇచ్చారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య జంబో జేసీబీలతో కన్వెన్షన్‌ను గంటల వ్యవథిలోనే అధికారులు కూల్చివేశారు.
వివాదం ఏంటి?
హీరో నాగార్జున నల్ల ప్రీతమ్ రెడ్డితో కలిసి మాదాపూర్‌లో ఎన్3 ఎంటర్ ప్రైజెస్ పేరుతో ఎన్ కన్వెన్షన్‌ను నిర్మించారు. మొత్తం 10 ఎకరాల్లో 2015లో ఎన్ కన్వెన్షన్ నిర్మాణం జరిగింది. ఇందులో 1.12 ఎకరాలు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నాయి. 2 ఎకరాలు బఫర్ జోన్‌ను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. ఇదే అంశంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. దాంతో హైడ్రా అధికారులు చర్యలు తీసుకున్నారు. హీరో నాగార్జున నిర్మించిన ఎన్ కన్వెన్షన్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారు. 1.12 ఎకరాలు, బఫర్ జోన్‌లో 2 రెండు ఎకరాల భూమి ఉంది. మొత్తం 3.12 ఎకరాల భూమిని ఆక్రమించి నిర్మాణం చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించడంతో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చి వేస్తున్నారు.
స్టే ఆర్డర్లు మరియు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరం. మా ప్రతిష్టను కాపాడటం కోసం, కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం మరియు చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలుపుట కొరకు ఈ ప్రకటనను జారీ చేయడం సరైనదని నేను…
— Nagarjuna Akkineni (@iamnagarjuna) August 24, 2024
న్యాయస్థానాన్ని ఆశ్రియిస్తా: నాగార్జున
ఎన్ – కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చివేయడంపై అక్కినేని నాగార్జున స్పందించారు. స్టే ఆర్డర్లు, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్-కన్వెన్షన్ కూల్చడం బాధాకరమని నాగార్జున పేర్కొన్నారు. ఎన్-కన్వెన్షన్ పట్టా భూమిలో కట్టామని.. ప్రైవేటు స్థలంలో నిర్మించిన భవనమని నాగార్జున పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన నోటీసులపై స్టే కూడా ఇచ్చారన్నారు. ఎలాంటి నోటీసులివ్వకుండా కూల్చడం సరికాదన్నారు. కోర్టు తనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చి ఉంటే నేనే కూల్చేవాడినంటూ పేర్కొన్నారు. ఈ పరిణామాల వల్ల అక్రమ నిర్మాణాలు చేశామని ప్రజలు భావించే అవకాశం ఉందన్నారు. కూల్చివేతలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని నాగార్జున స్పష్టంచేశారు.