Take a fresh look at your lifestyle.

మోదీ 3.0 అట్ట‌ర్ ప్లాప్ స‌ర్కార్

బీజేపీ ప్ర‌భుత్వానికి ఈ యూట‌ర్న్ లు కొత్తేం కాదు. అప్ప‌టి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హాకు "మిస్టర్ రోల్ బ్యాక్" అనే పేరు వచ్చింది

0 118

నిర్దేశం, న్యూఢిల్లీ: మోదీ ప్ర‌భుత్వం నిర్మించే ఎక్స్ ప్రేస్ వేల్లో ఉన్న యూట‌ర్నుల కంటే మోదీ ప్ర‌భుత్వంలో యూట‌ర్నులు ఎక్కువ‌య్యాయి. ఏదో కొండలు కూల్చుతున్న‌ట్లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డం వెంట‌నే వాటిని ఉప‌సంహ‌రించుకోవ‌డం బాగా అల‌వాటైంది. రైతు చ‌ట్టాలు, కొత్త పెన్ష‌న్ స్కీం, అగ్నీప‌థ్ లాంటి వాటిలో తీసుకున్న యూట‌ర్న్ తో విశ్వ‌గురు ప‌రువు పోయింది. అవి చాల‌న‌ట్టు ఇంకా యూట‌ర్న్ లు తీసుకుంటూనే ఉన్నారు.

నిజానికి.. బీజేపీ ప్ర‌భుత్వానికి ఈ యూట‌ర్న్ లు కొత్తేం కాదు. గ‌తంలో 1998-2004 మ‌ధ్య అధికారంలో ఉన్న స‌మ‌యంలో కూడా అనేక యూట‌ర్న్ లు తీసుకున్నారు. అప్ప‌టి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హాకు “మిస్టర్ రోల్ బ్యాక్” అనే పేరు వచ్చింది. ప్రత్యేకించి ఆయన హయాంలో అమలు చేసిన విధానాలు, వాటిలో నిరంతరం మార్పులు రావడంతో ఈ మారు పేరు వచ్చింది. నిర్ణ‌యాలు తీసుకోవ‌డం, ఆ త‌ర్వాత తూచ్ తొండి అంటూ వెన‌క్కి త‌గ్గడం బాగా జ‌రిగేది.

ఇప్పుడు ఆ రోల్ బ్యాక్ పాత్ర‌ను ఏకంగా ప్ర‌ధాన‌మంత్రే తీసుకున్నారు. తాజాగా.. లేటరల్ ఎంట్రీ, యుపిఎస్, వక్ఫ్ బోర్డు వంటి అనేక విధాన నిర్ణయాలను మోదీ ప్ర‌భుత్వం వెన‌క్కి తీసుకుంది. తాజాగా యూట‌ర్న్ తీసుకున్న అంశాల‌వో ఓసారి చూద్దాం.

యూపీఎస్సీ లాట‌ర‌ల్ ఎంట్రీ స్కీం

యూపీఎస్సీ లాటరల్ ఎంట్రీ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లో జాయింట్ సెక్రటరీ, డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ వంటి పోస్టుల‌ను నేరుగా రిక్రూట్ చేస్తారు. ఈ విధానం సాంప్రదాయ సివిల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియకు భిన్నంగా ఉంటుంది. ప్ర‌భుత్వాన్ని ప్రైవేటు వ్య‌క్తుల చేతుల్లో పెడుతున్నార‌ని విప‌క్షాలే కాదు మిత్ర‌ప‌క్షాల నుంచి కూడా తీవ్ర వ్య‌తిరేక‌త వ‌చ్చింది. దీనికి తోడు రాజ్యాంగపరమైన, పరిపాలనాపరమైన సవాళ్లు తలెత్తాయి. ఈ ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేయడం కష్టతరంగా మారింది. దీంతో ఈ నిర్ణ‌యాన్ని మోదీ ప్ర‌భుత్వం వెనక్కి తీసుకోవలసి వచ్చింది.

యూనియన్ పెన్షన్ స్కీమ్

2004 సంవత్సరంలో, దేశంలో ఎన్డీయే అధికారంలో ఉన్నప్పుడు.. పాత పెన్షన్ స్కీమ్‌కు స్వస్తి పలికి భారత ప్రభుత్వం ఎన్పీఎస్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పెన్షన్ పథకం ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర పౌరులు పదవీ విరమణ కోసం డబ్బును కూడబెట్టుకోవడానికి వెసులుబాటు క‌ల్పించింది. అయితే దీనిపై ప్రభుత్వ ఉద్యోగుల నుంచే తీవ్ర వ్య‌తిరేక‌త వ‌చ్చింది. పాత పెన్షన్ స్కీమ్ తో పోల్చితే గ్యారెంటీ లేకపోవడం ప్రధాన కారణమైంది. వాస్తవానికి, యూనియన్ పెన్షన్ స్కీమ్ మాదిరిగా కాకుండా, ఉద్యోగి పదవీ విరమణ తర్వాత ఎంత పెన్షన్ పొందుతారనే దానిపై ఎన్‌పిఎస్‌లో ఎటువంటి హామీ లేదు. దీన్ని ర‌ద్దు చేసింది యూపీఎస్ విధానాన్ని ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చింది. దీనిపై కూడా వ్య‌తిరేక‌త న‌డుస్తోంది.

బ్రాడ్‌కాస్టింగ్ బిల్లు 2024

బ్రాడ్‌కాస్టింగ్ బిల్లు 2024 ముసాయిదాను ప్రభుత్వం వెనక్కి తీసుకోవలసి వచ్చింది. వాస్తవానికి, ప్రభుత్వం మొదటగా ప్రసార బిల్లు ముసాయిదాను 10 నవంబర్ 2023న పబ్లిక్ డొమైన్‌లో ఉంచింది. ప్రభుత్వం సెన్సార్‌షిప్‌ను తీసుకురావడానికి ప్రయత్నిస్తోందంటూ తీవ్ర‌ ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. లోక్‌సభ ఎన్నికల అనంతరం ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత ప్రభుత్వం ముసాయిదాను ఉపసంహరించుకుంది.

వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు

నిన్నీమ‌ధ్య తీసుకువ‌చ్చిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై కూడా మోదీ ప్రభుత్వం వ్యతిరేకత ఎదుర్కొంది. ఈ బిల్లుపై విపక్షాలు మోదీ ప్రభుత్వాన్ని తీవ్రంగా లక్ష్యంగా చేసుకుని రాజ్యాంగంపై, మైనారిటీలపై దాడిగా అభివర్ణించారు. అయితే, ప్రభుత్వం ఈ బిల్లును ఉపసంహరించుకోలేదు, కానీ చర్చల కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి అంటే జేపీసీకి పంపింది.

భూసేకరణ ఆర్డినెన్స్

2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత, 2013 భూసేకరణ చట్టంలో మార్పులు చేస్తూ మోదీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ ఆర్డినెన్స్ ఉద్దేశ్యం మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక ప్రాజెక్టుల కోసం భూ సేకరణను సులభతరం చేయడం. అయితే, రైతుల అనుమతి లేకుండా భూసేకరణ చేయ‌డం వంటి వివాదాస్పద నిబంధనలను ఇందులో చేర్చారు. ఈ ఆర్డినెన్స్‌పై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమైంది. ముఖ్యంగా రైతుల నిరసనల కారణంగా, ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకుంది. 2013 నాటి అసలు చట్టాన్ని అమ‌లుకు పూనుకుంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking