కుంట గంగామోహన్ రెడ్డి ఇక లేరు..
తెలంగాణ కోసం కొట్లాడాడు.. అనాధలా మరణించాడు..
నిర్దేశం, నిజామాబాద్ :
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమాలు చేసిన కుంట గంగామోహన్ రెడ్డి (67) ఇక లేరు. వేసవి కాలం కావడంతో ప్రతి రోజు ఆర్మూర్ పట్టణ చివరలో గల చెరువులో స్నానం చేయడానికి గంగామోహన్ రెడ్డి వెళ్లేవారు. సోమవారం సాయంత్రం స్నానంకు వెళ్లి మరణించినట్లు తెలుస్తోంది. అయితే.. ఈత రాక పోవడం వల్లనే గంగారెడ్డి మరణించినట్లు చెబుతున్నారు.
తెలంగాణ జెండా పట్టి…
తెలంగాణ రాష్ట్రం కావాలని కేసీఆర్ ప్రారంభించిన టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలో ఉద్యమాలు చేసిన ఏడుగురిలో ఈ గంగారెడ్డి ఒకరు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రాక ముందు కేసీఆర్ పిలుపు మేరకు కుంట గంగామోహన్ రెడ్డి, సుంకె శ్రీనివాస్, టైలర్ వినోద్, సంతోష్, ఆవుసుల గంగామణి, మిట్టపల్లి గంగారెడ్డి, ఎల్ ఎల్ బి రాజేశ్వర్. సొంత కారుకు తెలంగాణ జెండా కట్టుకుని ప్రచారం చేస్తూ ఆర్మూర్ పట్టణంలో ఉద్యమాలు చేసిన వారిలో ముందు వరుసలో ఉన్నారు కుంట గంగామోహన్ రెడ్డి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత ఉద్యమం కోసం కోట్లాడిన కుంట గంగామోహన్ రెడ్డి, సుంకె శ్రీనివాస్, సంతోష్, టైలర్ వినోద్, ఆవుసుల గంగామణి ఈ ఐదు గురు అన్యాయానికి గురయ్యారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అన్యాయం..
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసే వారు లేని సమయంలో వీళ్ళే టీఆర్ ఎస్ ఉనికిని కాపాడారు. 2007 నుంచి 2014 వరకు జరిగిన తెలంగాణ ఉద్యమ కారుడిగా కుంట గంగామోహన్ రెడ్డికి మంచి పేరుంది. కానీ.. కేసీఆర్ ప్రభుత్వంలో లోకల్ రాజకీయాలతో అన్యాయానికి గురైన వారిలో కుంట గంగామోహన్ రెడ్డి, సుంకె శ్రీనివాస్, సంతోష్, టైలర్ వినోద్, ఆవుసుల గంగామణి ఉన్నారు.
ఆ కుటుంబంలో నలుగురు మృతి..
అయితే.. ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటాలు చేసిన కుంట గంగామోహన్ రెడ్డి కుమారుడు ప్రశాంత్ కరోనా కాలంలో మరణించారు. గతంలోనే గంగా మోహన్ రెడ్డి భార్య మరణించింది. అంతకు ముందు కుంట గంగామోహన్ రెడ్డి కూతురు మానసిక వికలాంగురాలు మరణించింది.
కుంట గంగారెడ్డి కేరాఫ్ తెలంగాణ ఉద్య మం..
అయితే.. మంగళవారం కుంట గంగామోహన్ రెడ్డి మరణించడంతో తెలంగాణ వాదులు ఆయన ఉద్యమ స్పూర్తి గురించి చర్చించుకుంటున్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటాలు చేసిన వారికి అన్యాయం జరిగిందనడానికి ఈ కుంట గంగామోహన్ రెడ్డి జీవితం నిదర్శనమంటున్నారు. ఏది ఏమైనా కుంట గంగామోహన్ రెడ్డి పేరు వింటేనే ఆర్మూర్ ప్రాంత ప్రజలకు తెలంగాణ ఉద్యమం గుర్తుకు వచ్చేంతా ప్రజలలో కలిసి పోవడం మరువలేని నిజం. ఆర్మూర్ ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు గెలిసిన జీవన్ రెడ్డి సైతం కుంట గంగామోహన్ రెడ్డితో పాటు మొదట్లో ఉద్యమం చేసినోళ్లకు న్యాయం చేయలేక పోయాడని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆర్మూర్ పట్టణంలో టీఆర్ ఎస్ కార్యకర్తలు లేని సమయంలో వీళ్లు కేసీఆర్ పిలుపు మేరకు ఆందోళన చేసి విలేకరుల వద్దకు వచ్చి వార్తలు ఇచ్చేవారని సీనియర్ జర్నలిస్టు తెలిపారు.
సుంకె శ్రీనివాస్ నివాళులు..
ఆర్మూర్ పట్టణంలో తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన కుంట గంగామోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పోరాటాలు చేసిన విషయాలను తెలంగాణ ఉద్యమ కారుడు సుంకె శ్రీనివాస్ గుర్తు చేసుకున్నారు. ఆర్మూర్ పట్టణంలో రాజకీయంగా, ఉద్యమం పట్ల అంకిత భావంతో పని చేసిన తమను కేసీఆర్ ప్రభుత్వం గుర్తించక పోవడం బాధగా ఉందన్నారు. రాజకీయ గురువు కుంట గంగామోహన్ రెడ్డి మరణించినా.. ఆర్మూర్ ప్రాంత ప్రజల హృదయాలలో నిలుస్తారన్నారు ఆయన.