నిర్దేశం, అహ్మదాబాద్: నకిలీ పోలీసు, నకిలీ డాక్టర్ గురించి వినే ఉంటారు. కానీ, ఏకంగా నకిలీ కోర్టే వెలిసింది. నిన్న, మొన్న కాదండోయ్.. ఏకంగా ఐదేళ్ల నుంచి ఈ నకిలీ కోర్టు నడుపుతున్నారు. ఈ కోర్టులో నకిలీ జడ్జి, నకిలీ లాయర్లు, నకిలీ ఇతర సిబ్బంది ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వరాష్ట్రం గుజరాత్ లో కొనసాగుతున్న దుర్మార్గం ఇది. దాదాపు ఐదేళ్లుగా ఆయన కేసులు వింటూ ఉత్తర్వులు జారీ చేస్తున్నారట.
మోరిస్ శామ్యూల్ క్రిస్టియన్ అనే వ్యక్తి స్వయంగా న్యాయమూర్తిగా మారి గాంధీనగర్‌లో నిజమైన కోర్టులాంటి వాతావరణాన్ని సృష్టించి ఉత్తర్వులు జారీ చేస్తున్నాడు. నిందితుడు మోరిస్ శామ్యూల్ క్రిస్టియన్ 2019లో ప్రభుత్వ భూమికి సంబంధించిన కేసులో తన క్లయింట్‌కు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేశాడు. అనుమానం వచ్చి అహ్మదాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదు చేయడంతో నకిలీ కోర్టు గుట్టు రట్టయింది.
సివిల్ కోర్టులో భూ వివాదాలకు సంబంధించిన కేసులు నడుస్తున్న వ్యక్తులను న్యాయమూర్తి క్రిస్టియన్ ఇంప్లీడ్ చేసేవారని చెబుతున్నారు. కేసు క్లోజ్ చేసేందుకు ప్రజల నుంచి డబ్బులు తీసుకునేవాడు. అతడు తనను తాను కోర్టు నియమించిన అధికారిక మధ్యవర్తి అని చెప్పుకునేవాడు. తన కార్యాలయానికి ప్రజలను పిలిచేవాడు. ఆయన కార్యాలయంలో కోర్టు లాంటి సెటప్ ఉంది. అతడు కేసు వినే సమయంలో అతడి అనుచరులు అచ్చం లాయర్లు, కోర్టు సిబ్బంది వలె ప్రవర్తించారు.
ఇటీవల కోర్టు రిజిస్ట్రార్ హార్దిక్ దేశాయ్ క్రిస్టియన్ మధ్యవర్తి కాదని లేదా ఆర్డర్ నిజమైనదని తెలుసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి కరంజ్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడిపై 2015లో నగరంలోని మణినగర్ పోలీస్‌స్టేషన్‌లో మోసం ఫిర్యాదు నమోదైనట్లు వెల్లడించారు. ఇంతకుముందు, గుజరాత్‌లోని మోర్బి జిల్లాలో ఎన్ఎచ్ఏఐ అధికారిక టోల్ ప్లాజా సమీపంలో కేవలం 600 మీటర్ల దూరంలో నకిలీ టోల్ ప్లాజాను నిర్మించి డబ్బు వసూలు చేసేవారు. దీన్ని ఛేదించే క్రమంలో పోలీసులు పెద్ద బట్టబయలు చేశారు. బీహార్‌లో ఓ వ్యక్తి నకిలీ ఐపీఎస్‌గా తిరుగుతున్నాడని, అతనిపై చర్యలు తీసుకున్నారు. ఇంకా ఇలాంటివి ఎన్నెన్ని ఉన్నాయో?