భయానకం.. ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరిగాయి, శిక్షలు తగ్గాయి

నిర్దేశం, హైదరాబాద్: షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలపై వందల ఏళ్లుగా దారుణమైన వివక్ష కొనసాగుతూ వస్తోంది. వివక్ష అంటే దూరంగా ఉండడం మాత్రమే కాదు.. వారితో వ్యవహరించే దురుసుతనం అతి దారుణంగా ఉంటుంది. మన దేశంలో ఈ రెండు వర్గాలు ఎదుర్కునే దాడులు ప్రపంచంలో మరే సమాజం ఎదుర్కోవడం లేదు. మానసిక, భౌతికంగా విపరీతమైన దాడులు. ఆర్థిక, సామాజిక దోపిడీ. అందుకే 1989లో భారత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలపై అణచివేత, అత్యాచారాలను నియంత్రించడం కోసం ఎస్సీ, ఎస్టీ (ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్) చట్టం తెచ్చింది.

ఈ చట్టం వచ్చినా దాడులు ఏమాత్రం తగ్గడం లేదు. నిజానికి, ఈ చట్టం దుర్వినియోగమవుతోందని, తమ వ్యక్తిగత కక్ష సాధించడం కోసం కొందరు దీన్ని ఆయుధంగా ప్రయోగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే, దళిత, గిరిజన సమాజంపై వివక్ష, దాడులు ఎందుకు ఆగడం లేదన్నది అసలు ప్రశ్న. కరెక్టుగా చెప్పాలంటే.. అట్రాసిటీ చట్టం మిస్ యూజ్ అవుతుందనే కంటే.. చాలా తక్కువ యూజ్ అవుతుందని దీని అర్థం. సామాజిక, ఆర్థిక, రాజకీయ బలహీనత వల్ల దాడులపై కేసులు పెట్టడానికే దళిత, గిరిజన ప్రజలు భయపడి మౌనంగా భరిస్తున్న ఉదంతాలు కొన్ని ఉంటే, ధైర్యం చేసి కేసు పెట్టినా సరే.. విచారణ ముగిసి నిందితులకు శిక్ష పడేలా చేయడంలో సఫలం కాలేకపోతున్నాయి.

ఈ ప్రత్యేక చట్టం ప్రకారం 2022లో దేశవ్యాప్తంగా నమోదైన కేసులు, గణాంకాలను ఓసారి పరిశీలిస్తే.. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ దాడులు, వివక్ష పెద్ద ఎత్తున ఇంకా కొనసాగుతున్నాయని అర్థమవుతోంది.

ఉత్తర భారతంలోనే దాడులు ఎక్కువ

తాజాగా నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా నమోదైన అట్రాసిటీ కేసుల్లో 97.7 శాతం కేవలం 13 రాష్ట్రాల్లో నమోదయ్యాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కేసుల సంఖ్యలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా 51,656 కేసులు నమోదైతే.. 23.78%(12,287 కేసులు)తో ఉత్తర్‌ప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత రాజస్థాన్‌ 8,651 (16.75%) కేసులతో 2వ స్థానంలో, మధ్యప్రదేశ్‌ 7,732 (14.97%) కేసులతో మూడవ స్థానంలో నిలిచాయి. అట్రాసిటీ కేసులు ఎక్కువగా నమోదైన మిగిలిన రాష్ట్రాల్లో బీహార్ 6,799 (13.16%), ఒడిశా 3,576 (6.93%), మహారాష్ట్ర 2,706 (5.24%) వరుసగా ఉన్నాయి. అంటే, 81 శాతం అట్రాసిటీ కేసులు ఈ 6 రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి.

గిరిజనులపై దాడుల్లో మధ్యప్రదేశ్ టాప్

గిరిజన-ఆదీవాసీలపై జరిగిన దాడులకు సంబంధించి నమోదైన అట్రాసిటీ కేసుల్లో మధ్యప్రదేశ్ తొలి స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా ఎస్టీ బాధితులు పెట్టిన కేసుల సంఖ్య 9,735 కాగా, ఇందులో ఒక్క మధ్యప్రదేశ్‌లో 2,979 కేసులు నమోదయ్యాయి. అంటే మొత్తంలో 30.61 శాతం దాడులు ఈ ఒక్క రాష్ట్రంలోనే జరుగుతున్నాయి. ఇక 2,498 (25.66%) కేసులతో రాజస్థాన్ 2వ స్థానంలో, 773 (7.94%) కేసులతో ఒడిశా 3వ స్థానంలో నిలిచాయి. వీటి తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర 691 (7.10%), ఆంధ్రప్రదేశ్‌ 499 (5.13%) నిలిచాయి.

సాక్ష్యాలు ఇవ్వడంలో ఫెయిల్

కేసులు నమోదు చేయడం వరకు ఒకెత్తయితే, వాటికి సంబంధించిన సాక్ష్యాలను సేకరించి కోర్టులో సమర్పించి నిందితులకు శిక్ష వేయించడం మరో ఎత్తు. అట్రాసిటీలపై చాలా కేసుల్లో చార్జిషీట్లు(తుది నివేదికల) దాఖలవుతున్నప్పటికీ.. వాటిలో చాలా వరకు సరైన సాక్ష్యాలు లేని కారణంగా విచారణ ముగుస్తోంది. కొన్ని తప్పుడు ఫిర్యాదులుగా ముగుస్తున్నాయి. ఎస్సీ సంబంధిత కేసుల్లో 60.38% కేసుల్లో చార్జిషీట్లు దాఖలు కాగా.. అందులో 14.78% కేసులు తప్పుడు ఫిర్యాదు లేదా సాక్ష్యాధారాలు లేకపోవడం వంటి కారణాలతో చార్జిషీట్లు దాఖలు చేసి విచారణ ముగించారు. 2022 చివరి నాటికి 17,166 కేసుల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఎస్టీలకు సంబంధించిన కేసుల్లో 63.32% కేసుల్లో చార్జిషీట్లు దాఖలు కాగా, 14.71% కేసులు చార్జిషీట్ తో ముగిశాయి. ఎస్టీలపై అట్రాసిటీలకు సంబంధించి 2,702 కేసుల్లో ఇంకా విచారణ కొనసాగుతోంది.

శిక్ష పడే రేటు తగ్గుతోంది

నిజానికి.. ఈ నివేదికలో ఆందోళన కల్గించే అంశం ఏంటంటే.. ఈ చట్టం కింద నమోదవుతున్న కేసుల్లో శిక్ష పడే రేటు తగ్గుతోంది. 2020లో నేరారోపణ నిరూపణ రేటు 39.2 శాతం ఉండగా.. అది 2022లో 32.4 శాతానికి తగ్గింది. ప్రత్యేక చట్టం ప్రకారం కేసుల విచారణ కొనసాగించడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులు తక్కువగా ఉన్నాయని నివేదిక పేర్కొంది. బహుశా.. ఆ కారణంగానే శిక్షలు తగ్గుతుండొచ్చు. ఈ కేసుల విచారణను వేగవంతం చేసేందుకు 14 రాష్ట్రాల్లోని 498 జిల్లాల్లో 194 జిల్లాల్లో ప్రత్యేక కోర్టులు ఏర్పడ్డాయి. దళిత, గిరిజనులు ఎక్కువగా దాడులకు గురవుతున్న జిల్లాలను నివేదిక గుర్తించింది. 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మాత్రమే అటువంటి జిల్లాలను ప్రకటించాయి. ఎస్సీలపై అత్యధిక అట్రాసిటీ కేసులు నమోదైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అట్రాసిటీ జోన్‌ను గుర్తించలేదని నివేదిక స్పష్టం చేసింది.

ప్రత్యేక కోర్టులు – ప్రత్యేక పోలీస్ స్టేషన్లు

ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మేఘాలయ, మిజోరం, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో ఎస్సీ-ఎస్టీ ప్రొటెక్షన్ సెల్‌లు ఉన్నాయి. ఇవి కులం పేరుతో జరిగే హింసాకాండను నివారించడంతో పాటు, ఆయా వర్గాలకు భద్రతను పటిష్టం చేసే లక్ష్యంతో ఏర్పడ్డాయి. ఎస్సీ-ఎస్టీలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఫిర్యాదుల నమోదు కోసం సిక్కిం, తమిళనాడు, తెలంగాణ, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, అండమాన్&నికోబార్ దీవులు, చండీగఢ్, ఢిల్లీ, జమ్మూ&కాశ్మీర్, లడఖ్, పుదుచ్చేరి బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, కేరళ, మధ్యప్రదేశ్‌లలో ప్రత్యేక పోలీసు స్టేషన్లు ఏర్పాటయ్యాయని నివేదిక పేర్కొంది. అయితే ఈ చట్టం గురించి అవగాహన లేక దాడుకు గురైనా సరే కేసులు పెట్టడానికి సైతం ముందుకు రాకుండా పోతున్న ఘటనలు దేశంలో ఎన్నున్నాయో లెక్కే లేదు. అదే సమయంలో అవగాహన ఉన్నవారిలో కొందరు చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ వ్యక్తిగత కక్షసాధింపు కోసం ఉపయోగించుకుంటున్న ఉదంతాలు సైతం లేకపోలేదు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!