రక్తంతో ‘‘తడిసిన’’ ఉద్యమం నక్సల్స్ – పోలీసుల హింస ఆగేదెప్పుడు..?  05

రక్తంతో ‘‘తడిసిన’’ ఉద్యమం

నక్సల్స్ – పోలీసుల హింస ఆగేదెప్పుడు..?

ధారావాహిక – 05

Naxalite 05   

భారత దేశంలో నక్సలైట్ ఉద్యమం లేనప్పుడు గ్రామాలన్నీ భూస్వాముల కబంద హస్తలలో ఉండేవి. ఆ ఊళ్లే దొర చెప్పిందే వేదం. భూస్వామికి ఆ ఊరు ప్రజలంతా బానిసలే.. స్వాతంత్ర్యం సిద్దించినా ఆ పల్లెటూర్ లలో స్వేచ్ఛలేదు. కళ్ల ముందు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించే నాథుడు కనిపించే పరిస్థితి లేదు.. అందమైన ఆడపడుచు కూడా ఆ దొర పక్కలో పండాల్సిన పరిస్థితులు ఉండేవి. అగో ఆ సమయంలోనే నక్సలైట్లు రంగ ప్రవేశం చేశారు. నక్సల్భరీలో కామ్రేడ్ చారు మజుందర్ అంటించిన నిప్పు రవ్వ చెలరేగి.. శ్రీకాకుళం అడవులను అంటుకుంది. ఆ మంటనే ఉత్తర తెలంగాణలో ఉప్పెనలా  ఉదృతమైంది. కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలో ప్రారంభమైన నక్సలైట్ ఉద్యమం దేశ వ్యాప్తంగా విస్తరించింది.

రాజ్యం.. అధికారగణం.. దారుణ వైఫల్యం, దోపీడిదారులతో అధికారులు కుమ్మక్కై గిరిజనులను ఆయుధాల వైపు నడిపించాయి. అప్పటి నుంచి దాదాపు ప్రతి తునికాకు సీజన్‌లోనూ నక్సలైట్ల ఆధ్వర్యంలో సమ్మె చేపట్టి కావాల్సిన ధర సాధించుకోవడం అనవాయితీగా మారింది. గిరిజన పోరాటాలతో పాటే మైదాన ప్రాంత పోరాటాలు కొనసాగాయి. పల్లెల్లో భూస్వాములపై ఉద్యమాలకు గ్రామాలను కదిలించారు.  అంతకాలం జరిపిన అనేక అక్రమాలకు దొరలను ప్రజాకోర్టులలో శిక్షించారు.
బ్రతుకు తెరువు కోసం గల్ఫ్‌ దేశాలు వెళ్లే వారికి వడ్డీ వ్యాపారులుగా దొరలిచ్చిన వందకు నెలకు ఐదు నుంచి పది రూపాయలు వడ్డీ పత్రాలు ప్రజాకోర్టుల్లో దగ్దమైనాయి. అప్పు అడిగితే  ఆస్థులు తాకట్టు పెట్టుకుని నెత్తురు పిండే వడ్డీ వ్యాపారులకు బడితే పూజలు జరిగాయి. నూటికి రెండు రూపాయలకంటే అధికంగా వడ్డీ తీసుకోరాదన్న ఆదేశాలు జారీ అయ్యాయి. అవి అమలుకు కూడా నోచుకున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే నక్సలైట్లు పోటీ ప్రభుత్వం కొనసాగించారు.
కలలో కూడా ఊహించని అనేక పరిణామాలకు కారకులైన (నక్సలైట్లు) అన్నలను సాక్షాత్తూ దేవుళ్లుగా ప్రజలు ఆరాధించారు. ఎక్కడ సమావేశాలు జరిపినా సభలు పెట్టినా వరదలా ప్రజలు రావడం మొదలైంది. ఇదే సమయంలో సారా ధర తగ్గించే ఉద్యమం చేపట్టిన నక్సల్స్‌ కాంట్రాక్టర్‌లతో చర్చలు జరిపి విజయం సాధించారు. భూస్వాముల, వడ్డీవ్యాపారుల దోపీడి నిలిచి పోవడంతో గ్రామాల రూపురేఖలు మారి పోయాయి. నక్సల్స్‌తో కలిసి ఉండటం వారికి సహాకరించడం, అన్నల ఆధ్వర్యంలో నడిచే సంఘంలో చేరడం సామాన్యుడికి స్టేటస్‌ సింబల్‌గా మారింది. సంఘ సభ్యులు కాలక్రమంలో మిలిటెంట్లుగా రూపాంతరం చెందారు. గ్రామాలకు గ్రామాలే అన్నలకు ఆటపట్టుగా మారాయి. దొరల రాజ్యం స్థానే మిలిటెంట్ల రాజ్యం వచ్చింది. అంతదాకా దొరలు నిర్వహించిన పంచాయితీలు మిలిటెంట్లు నిర్వహించడం ప్రారంభించారు. గ్రామాలలో సామాన్యులు ఎదుర్కొనే సమస్యలతో పాటు భూవివాదాలు, భార్యభర్తల మధ్య విబేధాలు, కొట్లాటలు, ప్రేమ వ్యవహారం ఇలా అన్ని సమస్యలు దళం ముందుకు పంచాయతీ రూపంలో వచ్చేవి. తగిన న్యాయం కూడా జరగడం దండుగలు దడ్‌వత్‌ల పేరిట దొరలు చేసిన దోపిడీ  నిలిచి పోవడంతో పల్లె గుండెల్లో ఎర్రెజెండాలు గూడుకట్టుకున్నాయి. గ్రామాల్లో శరవేగంగా నక్సల్స్‌ రాజ్యం విస్తరిస్తున్నా పోలీసులు మౌనాన్నే ఆశ్రయించారు. రాజ్యం ఇంకా నిర్భంధానికి సంకల్పించలేదు.

కారణం…? దాని ఉనికికి  అప్పటికి ఇంకా ప్రమాదం ఏర్పడలేదు. సమాచార వ్యవస్థ సైతం అంతగా విస్తరించలేదు. ప్రజాకోర్టులు, శిక్షలు గ్రామాల్లో మాములుగా జరిగే దొమ్మిల వంటి సాధారణ నేరాల స్థాయిలోనే పోలీసులు పరిగణించారు. ప్రభుత్వం సైతం ఈ కార్యకలాపాలను మౌనంగా గమనించిందే తప్ప అణచివేతకు పూనుకోలేదు. నిజానికి ఉద్యమాలను అణిచివేసే అధికారాలు గాని ఆయుధాలు గాని పోలీసుల వద్ద లేవు. కాల్పులు జరపాలన్నా కలెక్టర్‌ అనుమతి తప్పని సరి కావల్సి వచ్చేది. అందువల్లే నక్సల్స్‌ బహిరంగంగా ఎన్ని సభలు పెట్టుకున్నా. రోడ్డెక్కి ఆందోళనలకు దిగినా. పోలీసులు లాఠీలతోనే అదుపు చేసేందుకు యత్నించేవారు. అలాగే నక్సల్స్‌ కూడా పోలీసులను శత్రువుగా పరిగణించలేదు. వారితో ఎప్పుడూ ముఖాముఖి పోరాటానికి దిగలేదు. అప్పటికి వారి వద్ద తపంచాలవంటి సాధారణ స్థాయికి  మించిన ఆయుధాలు లేవు.

పల్లెలో పేద ప్రజలను దోపీడి చేస్తున్న భూస్వాములను హంతం చేయడంతో ప్రజలు తమపై విశ్వాషం పెంచుకుంటారని భావించింది అధిష్టాన వర్గం. కరీంనగర్‌ జిల్లా జగిత్యాల్‌ తాలుఖ మద్దునూర్‌ భూస్వామి రాజేశ్వర్‌రావు ఆరాచకలపై కన్నెర్ర చేసారు నక్సల్స్‌. అతనిని హత్య చేయడానికి యత్నించిన యాక్షన్‌ టీమ్‌ సమాచారం తెలుసుకుని పారి పోయాడు. ఆ తరువాత తపాల పూర్‌లో భూస్వామి పితాంబరావును హత్య చేయడానికి వెళ్లిన యాక్షన్‌ టీమ్‌ ను చూసి గుండెపోటుతో మరణించారు. నక్సల్స్‌ హత్య చేసారని భావించారు. అతని కుమారులపై దాడి చేసి ఖతం చేసింది నక్సల్స్‌ దళం.. అలాగే తిమ్మాపూర్‌లో వడ్డి పేరిటా ప్రజలను ఫీడిరచే వడ్డి వ్యాపారిని హత్య చేసారు నక్సల్స్‌. చందుబట్ట గ్రామంలో మరో వడ్డి వ్యాపారిని హత్య చేసారు. నగ్జల్‌బరి ఉద్యమానికి ఆకర్శితులైన భూమాగౌడ్‌, కిష్టయ్యలు ఇద్దరు తమ ఊరు భూస్వామిని హత్య చేసినందుకు ప్రభుత్వం ఉరి తీసింది. ఈ ఇద్దరిని పోలీసులకు పట్టిచ్చిన ఇన్‌పార్మర్‌ను నడి రోడ్డులో నరికి హత్య చేసారు నక్సల్స్‌.
మొదట్లో అక్కడక్కడా  చిన్న చిన్న భూస్వాములపై జరిగిన దాడులకు బడా దొరలు స్పందించలేదు. మందీ మార్బలం లేని అర్భాకులపై దాడులు జరిగాయానుకున్నారు. అయితే రోజుకొకటిగా దొరల ఊళ్లు ఎర్రబారుతుంటే వారిలో కంగారు పుట్టింది.
నక్సల్స్ దళం వచ్చింది.. వచ్చిందీ అనుకుంటుండగానే అన్ని ఊళ్లనే ఉద్యమం చుట్టు ముట్టుంది. దీనితో భూస్వాములలో ఆందోళన హెచ్చింది. రొమ్ము విరుచుకు తిరిగిన ఊళ్లలో దొరలు భయపడే పరిస్థితి ఏర్పడగానే సర్కార్‌ శరణు జొచ్చాయి. తమ ఆయువు పట్టుగా ఉన్న దొరలు ఎదురు తిరిగితే పునాదులు కదుల్తాయన్న భయంతో సర్కారు రంగ ప్రవేశం చేసింది. ఫలితం కల్లోలిత ప్రాంత చట్టం. ఉద్యమ అణచివేత చర్యలు. కరీనంగర్‌ జిల్లాలో కల్లోలిత ప్రాంత చట్టం  అమలు చేయగా మిగిలిన చోట్ల అణివేత విధానాలు ప్రారంభించారు. పోలీసులకు ఆయుధాలు, అధికారాలు దారాదత్తం చేశారు.

నిర్బంధపు నిశీధిలో పోరుబాటే వేగుచుక్క..  

తన ఆయువు పట్టైన భూస్వామ్య రక్షణకు రాజ్యం నడుం బిగించింది. సాధారణ చట్టాల స్థానే ప్రత్యేక చట్టాలను తెచ్చింది. పోలీసులకు ప్రత్యేక అధికారాలను దారాదత్తం చేసింది. ఆయుధ వ్యవస్థను బలోపేతం చేసింది. అయినా అప్పటికింకా మండలానికో పోలీసుస్టేషన్‌ లేదు. పోలీసుల సంఖ్య, ఆయుధాల బలం తక్కువే. కొత్తగా సంక్రమించిన అధికారాలు పోలీసులకు బలానిచ్చాయి. గ్రామాల్లో అప్పటికి ఉద్యమ కార్యకలపాలన్నీ ‘సంఘం’ పేరు మీదే కొనసాగుతున్నాయి. పోలీసులు తమ దృష్టిని సంఘంపై కేంద్రికరించారు. దొరల నివాసాలు గడీలపై దాడులు జరిగినపుడల్లా పోలీసులు విరుచుకు పడడం దొరికిన గ్రామస్థులను పట్టుక పోయి లాకప్‌లో పెట్టడం ప్రారంభించారు. ఉద్యమ కార్యకర్తలను భౌతికంగా నిర్మూలించాలన్న ఆలోచన వారిలో లేదు. సంఘం దాడులను పోలీసులు మరో మార్గంలో వినియోగించుకున్నారు. వందల సంఖ్యలో గ్రామస్తులను పట్టుకురావడం కేసులని బెదిరించి సొమ్ము చేసుకోవడం ప్రారంభించారు. ఆ సమయంలో నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాలలో పని చేసిన పోలీసు అధికారులు ఈ మార్గంలో కుభేరులు అయ్యారు. ప్రభావిత ప్రాంతాల పోస్టుల కోసం ఎస్‌ఐలు.. సీఐలు.. డిఎస్‌పిలు ఎగబడేవారు.
(6వ ఎపిసోడ్ లో కలుద్దాం..)
Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »