రక్తంతో ‘‘తడిసిన’’ ఉద్యమం
నక్సల్స్ – పోలీసుల హింస ఆగేదెప్పుడు..?
ధారావాహిక – 06
భూపోరాట సమస్య…
రాజ్య నిర్భంధం ప్రారంభమైనా అది ఉద్యమ కార్యకలపాలను చీకకు పరిచిందే. తప్ప నిరోధించే స్థాయిలో లేదు. పైపెచ్చు రాజ్య ప్రతినిధులైన పోలీసులు ప్రజలకు శత్రువులుగా మారుతున్నారు. ఈ సమయాన్ని ఆసరాగా తీసుకుని భూపోరాట కార్యక్రమాలను ఉదృతం చేశారు నక్సల్స్. అనేక గ్రామాల్లో భూస్వాముల భూముల్లో ఎర్రజెండాలు పాతి భూమి లేని నిరుపేదలకు పంపిణీ చేయడం మొదలైంది. గ్రామాలకు గ్రామాలే నక్సల్స్ తమ కోసం పోరాటాలు చేస్తున్నారని భావించారు. అంతే.. నక్సల్స్ నాయకత్వంలో చెరువులు నిర్మాణం చేసుకున్నారు. రోడ్లు నిర్మాణం చేసుకున్నారు. నక్సలైట్లను ఆపదలో ఆదుకునే నక్సలైట్లుగా భావించారు జనం.

మారిన గ్రామాలలో సంఘటితంగా ఉన్న గ్రామస్థులను ఏమి చేయలేక తమ ఆస్తులను కాపాడుకోలేక భూస్వాములు భయాందోళనలకు గురయ్యారు. రోజుకో ఊరునుంచి భూపోరాట వార్తలు అందుతుండడంతో కొందరు భూస్వాములు ఇక లాభం లేదని సంఘంతో చర్చించి భూములను స్వచ్ఛందంగా ఇచ్చి వేసిన సంఘటలను ఈ కాలంలో చోటు చేసుకున్నాయి. మరికొన్ని చోట్ల భూస్వాములు తమ తాబేదార్లతో సంఘంను ఎదురించి ఘర్షణకు దిగిన సంఘటనలూ ఉన్నాయి.
ఒకవైపు భూముల అక్రమణ, మరోవైపు గడీలపై దాడులు, ఇంకోవైపు దౌర్జన్యాలకు పాల్పడ్డ పెత్తందారులకు ప్రజాకోర్టులో బహిరంగ శిక్షలు అమలు కావడంతో వెర్రులెత్తిన భూస్వాములు ఇక పల్లెల్లో మనలేని స్థితి ఏర్పడింది. ‘ఏరా…’ అంటూ పిలిచినా భూస్వామి ‘ఏమోయ్..’ అంటు పిలిచే పరిస్థితి ఏర్పడింది. బతుకు జీవుడా అంటు పలువురు భూస్వాములు పట్టణాల దారి పట్టారు. మధ్యలో ఎన్నికలు రావడం అధికారంలోకి వచ్చిన చెన్నారెడ్డి ప్రభుత్వం పోలీసు నిర్బంధానికి వెసులుబాటు ఇవ్వడంతో భూపోరాట కార్యక్రమం ఉవ్తెత్తున ఎగిసింది.

ఎన్నో ఏళ్లుగా గ్రామాలలో తిరుగులేని రాజులుగా చలామణియైన భూస్వాములు, దొరలు నక్సల్స్ రంగ ప్రవేశంతో ఉత్సహ విగ్రహాలుగా మారిపోయారు. అప్పటి వరకు తమ ఆధీనంలో ఉన్న వందలాది ఎకరాల భూములను నక్సల్స్ స్వాధీనం చేసుకోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో ప్రభుత్వం శరణుజొచ్చారు. మూకుమ్మడిగా మొరపెట్టుకున్నారు. దీంతో ప్రభుత్వం అంతవరకు అనుసరించిన నిర్భంధ విధానం స్థానే సంఘం నిర్మూలన కార్యక్రమానికి పచ్చజెండా ఊపింది. అప్పటికే నక్సల్స్ సమస్య ఉన్న ప్రాంతాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లు సమీక్షించి నక్సల్స్ నిరోధం కన్నా నిర్మూలన ద్వారా ప్రయోజనం ఉందని భావించింది. నక్సల్స్ కార్యకలపాలను అణచడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేయడం ప్రారంభించారు పోలీసులు..
ప్రతిఘటన వ్యూహం ఫలించింది. తీవ్ర నిర్భంధం వల్ల అనేక ఇబ్బందులు పడి వెనక్కి తగ్గినా.. ప్రజలకు ప్రతిఘటన కార్యక్రమం అనంతరం నమ్మకం పుంజుకుంది. ఎంతటి నిర్భందాన్నైనా ఎదుర్కోగల సత్తా ఉద్యమానికి ఉందన్న విషయం వెల్లడి కావడంతో ఉద్యమం పట్ల ఆకర్షణ పెరిగి ముఖ్యంగా యువకులు ఉద్యమంలో భాగస్వాములయ్యారు.
చర్య ప్రతి చర్యకు దారి తీస్తుంది.
నక్సల్స్ చర్యలు పోలీసుల దాడులకు దారితీస్తే వారి దాడులకు నక్సల్స్ ప్రతి దాడులు ప్రారంభించారు. ఉద్యమ తొలిదశలో భూస్వాములపై నక్సల్స్ దాడులు చేసినపుడు ఎదురైన ప్రతిఘటన స్వల్ప స్థాయిలో ఉండేది. కానీ, రాజ్య రక్షణకు నిలిచిన పోలీసుల బలం పెద్దది. అందుకే ప్రతిఘటన గెరిల్లా పద్దతిలో ఎంచుకోవలిసి వచ్చింది. పోలీసు వ్యవస్థకు ముఖాముఖి ఎదురు నిలిసి పోరాడే శక్తి ఉద్యమానికి లేదు. బలవంతుడైన శత్రువు అడ్డగా నిలిసిన సందర్భంలో గెరిల్లా పోరు తప్పని సరి. తొలుత ఆకస్మికంగా దాడులు.. కాల్పులకు పరిమితమైన ప్రతిఘటన.. నిర్భందం నానాటికి విస్తరించడంతో మందు పాతరల వ్యూహానికి మారింది. అపుడపుడూ పోలీసు స్టేషన్‌లపై దాడి రూపంలో శత్రువును భయపెట్టడం కూడా జరిగింది. దీనికి పోలీసులు తీవ్రంగానే స్పందించారు. ఉద్యమకారులను భౌతికంగా నిర్మూలించడం ప్రారంభించారు. దీనికి వారు చెప్పుకునే కారణాలు ఉన్నాయి. ప్రముఖ నక్సలైట్లు ముప్పాల లక్ష్మణరావు, మల్లోజుల కోటేశ్వర్‌రావు, తుచర్‌కాంత్ బట్టచార్య, మీసాల రాజిరెడ్డి, నల్లా ఆదిరెడ్డి, రాంచందర్, దొంతు మార్కెండెయా ఇలా చాలా మందిని గతంలో అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచారు. బెయిల్ మీద వెళ్లిన వారు మళ్లీ దొరుకలేరు. కేసు విచారణా సాగలేదు. పైపెచ్చు వారిని అరెస్టు చేసిన పోలీసులకు ప్రాణభయంతో బతకాల్సి వచ్చింది. రాజ్యాంగాన్ని అంగీకరించని వారిని రాజ్యాంగ పరిధిలో శిక్షించడం సాధ్యం కాదన్నది పోలీసు అధికారుల అంతరంగం.
తెలంగాణ వ్యాప్తంగా నానాటికి ఈ ఉద్యమం తీవ్రం కావడంతో భీతిల్లిన ప్రభుత్వం వెసులు బాటును రద్దు చేసింది. నిర్భందం మరింత తీవ్రమైంది. పోలీసు స్టేషన్‌లకు ఎన్‌కౌంటరులు టార్గెట్ ఇచ్చారని పుకార్లు బయలు దేరాయి. రోజుకో ఎన్‌కౌంటర్ చొప్పున తెలంగాణ జిల్లాలు రక్తసిక్తమయ్యాయి. నూనుగ మీసాల పిల్లలు సైతం ఎన్‌కౌంటర్లలో సమీథలయ్యారు.
నిరంతార యుద్దాలతో నెత్తురుటేరులు ప్రవహిస్తున్న సందర్భంలో ఎదురైన ప్రశ్న ఇది.
అసలు ఉద్యమ శత్రువు ఎవరు..? దాడులు ఎవరిపై జరుగుతున్నాయి..?
అయితే.. వెనుదిరిగి చూసే అవకాశం ఇటు పోలీసులకు అటు నక్సల్స్‌కు లేదు.
నిజానికి పోలీసులు చాలా వరకు అగ్రకులాల అణిచివేతలకు గురైన వర్గం నుంచి వచ్చిన వారే.
‘పొట్టకూటి కోసం పోలీసులైన వారే..’
అయినా ఒకే వర్గానికి చెందిన వారి మధ్య ఆగర్భ శతృత్వం నెలకొంది.
ఉద్యమ లక్ష్యం కన్నా శత్రువును దెబ్బ తీయడానికి లేదా శత్రువు ఉనికి తెలియకుండా ఉండేందుకు నక్సల్స్ ప్రాధాన్యత ఇవ్వవలిసిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
రాజ్యంగా రక్షణ కోసం శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులు రాజ్యాంగ విరుద్దంగా ఉద్యమకారులను భౌతిక నిర్మూలనకు దిగాల్సి వచ్చింది.
‘కాలి వెనక్కి తీస్తే మేము మిగలం’ అందుకే తప్పో ఒప్పో ముందుకు వెళ్లాల్సిందే. అని ఓ పోలీసు అధికారి ఈ యుద్దంపై వ్యాఖ్యానించాడంటే పరిస్థితులు ఎంత వరకు చేజారి పోయాయో అర్థం చేసుకోవచ్చు.
‘ఉద్యమ కారులను భౌతికంగా అంతం చేయడం’ కార్యక్రమంగా పెట్టుకున్న పోలీసులను అడ్డు తొలగించుకోవడం అనివార్యమని నక్సల్స్ చెప్పుకున్నారు.
వర్గ శత్రువు కాకపోయినా వర్గ శత్రు స్వభావం కలిగి ఉన్నందున ఇది తప్పని సరి అయ్యింది.